జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి : స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖకు చెందిన ఓ అవినీతి చేప ఏసీబీకి(ACB) చిక్కింది. ఇంటిస్థలం సేల్‌డీడ్, మార్టిగేజ్ కోసం రూ.10వేలు లంచం డిమాండ్ చేసి, రూ.5వేలు తీసుకుంటూ బుధవారం అడ్డంగా దొరికిపోయారు. డబ్బులు తీసుకున్న కార్యాలయ అటెండర్, దస్తావేజులేఖరితోపాటు సబ్‌రిజిస్ట్రార్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం, జగిత్యాల జిల్లాలో కలలం రేపింది. ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ రమణామూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సుంకే విష్ణు అనే బ్యాంకు ఉద్యోగి మెట్‌పల్లి పట్టణంలోని సాయిరాంనగర్ కాలనీలో 266 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ఇంటి స్థలం సేల్‌డీడ్, మార్టిగేజ్ రిజి్రస్ట్రేషన్ కోసం దస్తావేజు లేఖరి (డాక్యుమెంట్ రైటర్)తో దస్తావేజులను (డాక్యుమెంట్)తయారు చేయించారు.
గత నెల 28న దస్తావేజు లేఖరి వద్ద సహాయకుడిగా పనిచేసే ఆర్మూరు రవి సబ్‌రిజిస్ట్రార్ వద్దకు సదరు దస్తావేజులను తీసుకెళ్లాడు. సేల్‌డీడ్, మార్టిగేజ్ డీడ్ రిజిస్ట్రేషన్‌కు రూ.10 వేలు ఇవ్వమని సబ్‌రిజిస్ట్రార్ డిమాండ్ చేశారు. అయితే విష్ణు డబ్బులు ఇవ్వకపోవడంతో రిజిస్ట్రేషన్ చేయకుండా పక్కన పెట్టారు. లంచం అంత ఇచ్చుకోలేనని, రూ.5వేలు ఇస్తానని విష్ణు చెప్పడంతో రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్‌రిజిస్ట్రార్ అంగీకరించారు. కాగా, సేల్‌డీడ్, మార్టిగేజ్ కోసం అన్ని సక్రమంగా ఉండి కూడా లంచం ఇచ్చేందుకు ఇష్టపడని అతను, ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఈ క్రమంలో డీఎస్పీ రమణామూర్తి ఆధ్వర్యంలో ఏసీబీ కార్యాలయంపై నిఘా పెట్టారు.
దస్తావేజులేఖరి సహాయకుడి ద్వారా రూ.5 వేలు లంచం డబ్బులు సబ్‌రిజిస్ట్రార్ వద్దకు తీసుకెళ్లగా, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో అటెండర్‌గా పనిచేస్తున్న బానోతు రవికుమార్‌కు ఇవ్వమని సూచించారు. సబ్‌రిజిస్ట్రార్ చెప్పినట్లుగానే అటెండర్‌కు డబ్బులు ఇస్తుండగా, ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వెంటనే సబ్‌రిజిస్ట్రార్, అటెండర్‌తో పాటు దస్తావేజులేఖరి సహాయకుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ముగ్గురి నిందితులను కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ వివరించారు.