భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: గ్రావెల్ తవ్వకాలకు అనుమతి కల్పించేందుకు 30 వేల రూపాయల లంచం డిమాండ్ చేసిన భద్రాచలం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బర్పటి రమేష్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భద్రాచలం పోలీస్ స్టేషన్‌లోనే అతనిని, అతని గన్‌మెన్ రామారావుతో కలిసి ఏసీబీ డీఎస్పీ రమేష్ ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ పనులలో అవినీతిని అరికట్టేందుకు ఏసీబీ నిఘా మరింత కఠినమవుతోంది. తాజా కేసులో, బాధితుడిని బెదిరించి—లంచం ఇస్తేనే గ్రావెల్ తవ్వకాలకు అనుమతి ఇస్తానని—దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. చివరికి గన్‌మెన్ రామారావు ద్వారా ఒక మూడో వ్యక్తికి ఫోన్‌పే (UPI) ద్వారా లంచం జమ చేశాడు బాధితుడు. ఈ లావాదేవీలన్నింటినీ రికార్డు చేసిన బాధితుడు, వాటిని ఆధారాలతో సహా ఏసీబీ ఖమ్మం అధికారులకు అందించాడు.
సీఐ రమేష్‌పై ఇది మొదటి అవినీతి ఆరోపణ కాదు. గత ప్రభుత్వ హయాంలోనూ భారీగా అక్రమాలకు పాల్పడి అనేక ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. ఇదే పోలీస్ స్టేషన్‌లో కొద్దిమాసల క్రితం లంచం తీసుకుంటుండగా ఎస్సై శ్రీనివాస్, కానిస్టేబుల్ శంకర్ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కారు.
ఖమ్మం జిల్లాలో ఏడాదిలో ఏకంగా ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లను ఏసీబీ అదుపులోకి తీసుకోవడం శోచనీయమని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. పోలీసు వ్యవస్థలోని కొందరు, గన్‌మెన్లు, డ్రైవర్లు, ప్రైవేట్ వ్యక్తులను మధ్యవర్తులుగా మార్చుకుని, అందిన కాడికి లంచాలు వసూలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారుల స్పందన
ఈ కేసుపై పూర్తి విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు హామీ ఇచ్చారు. “అవినీతి ఎక్కడ నుంచైనా మొదలైతే, అక్కడే అరికట్టాలి. చట్టం అందరికీ సమానమే,” అని ఏసీబీ డీఎస్పీ రమేష్ అన్నారు.