ప్రభుత్వ అధికారులతో పని చేయించుకోవడం మన హక్కు, ఆ హక్కను లంచంతో కొనొద్దు’.. ఠాగూర్ సినిమాలో హీరో చిరంజీవి చెప్పే డైలాగ్ ఇది. నిజంగానే ప్రభుత్వ ఉద్యోగులు ఉందే మన కోసం పనిచేయడానికి కానీ కొందరు అక్రమార్కులు మాత్రం లంచం ఇస్తేనే పని జరుగుతుందంటారు.
లంచం తీసుకోవడం, ఇవ్వడమూ రెండూ నేరమనే విషయం తెలిసినా ఇప్పటికీ ఈ జాడ్యం మాత్రం మారడం లేదు. అయితే ఇలా లంచాలు తీసుకునే ఉద్యోగుల ఆటకట్టించేందుకు ఉందే అవినీతి నిరోధక శాఖ (యాంటీ కరప్షన్ బ్యూరో). లంచాలు తీసుకునే వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని శిక్షించడమే ఈ శాఖ పని.
క్రమంలోనే ఏసీబీ అధికారులు లంచం తీసుకున్న వారిని పట్టుకునేందుకు రకరకల చర్యలు తీసుకుంటుంటారు. ఇందులో భాగంగానే వారిని సాక్షాలతో పట్టుకునేందుకు ఒక పని చేస్తారు. సాధారణంగా ఎవరైనా లంచం తీసుకుని పట్టుబడ్డారనే వార్త రాగానే వార్త పత్రికల్లో, న్యూస్ ఛానెల్స్ లంచంగా తీసుకున్న డబ్బుతో పాటు పింక్ కలర్ నీటితో ఉన్న బాటిల్స్ దర్శనమిస్తాయి. ఇంతకీ పింక్ కలర్‌లో ఉండే ఆ లిక్విడ్ ఏంటి.? దానిని ఎందుకు ఉంచుతారు.? ఎప్పుడైనా ఆలోచించారా.? దీని అసలు ఉద్దేశం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
ఎవరైనా అధికారి లంచం డిమాండ్ చేయగానే సదరు వ్యక్తి అవినీతి నిరోధక శాఖకు తెలియజేస్తాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ముందుగా సదరు అధికారికి ఇచ్చే లంచం కరెన్సీపై ఎలాంటి అనుమానం రాకుండా ఫినాఫ్తలిన్ పౌడర్‌ను జల్లుతారు. దీంతో డబ్బులు తీసుకున్న వ్యక్తి డబ్బను లెక్కించే సమయంలో చేతులకు ఫినాఫ్తలిన్ పౌడర్ అంటుకుంటుంది. డబ్బు చేతులు మారగానే ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇస్తారు. అనంతరం లంచం తీసుకున్న వ్యక్తి చేతులను సోడియం కార్బోనేట్ కలిపిన నీటిలో చేతులని ముంచాలని చెబుతారు. ఫినాఫ్తలీన్ పౌడర్ అంటుకుని ఉన్న చేతులను ఈ నీటిలో ముంచడం వల్ల ఆ నీరు పింక్ కలర్‌లోకి మారుతుంది. సోడియం కార్బోనేట్ అనేది ఆల్కలైన్ ద్రావణం. అందుకే పింక్ కలర్ ఏర్పడుతుంది. ఈ పింక్ కలర్ వాటర్‌ను కోర్టులో సాక్ష్యంగా చూపించడం ద్వారా లంచం తీసుకున్న అధికారికి శిక్ష పడేలా చేస్తారు.