ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా అద్దంకి సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి ప్రాంతంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. ఆ రూట్ లో వెళుతున్న వాహనదారులు ఈ ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. బస్సులో నుంచి బాధితులను బయటకు తీశారు.
తిరుపతి నుంచి హైదరాబాద్ కు వెళుతున్న టీజీఎస్ ఆర్టీసీ బస్సు రాధాకృష్ణపురం వద్ద ప్రమాదానికి గురైందని పోలీసులు చెప్పారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రాథమిక పరిశీలనలో గుర్తించారు. గాయపడిని వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారని, వీరిలో 20 మందికి పైగా గాయాలయ్యాయని చెప్పారు.