ఈ మధ్య కేసీఆర్ కుక్కలు ఎగిగెరిగిరి పడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తీవ్రపదజాలంతో విమర్శలు చేయడం…. కేసు నమోదు కావడంపై దయాకర్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. కేటీఆర్ నుంచి సుమన్ వరకు… కేసీఆర్ కుక్కలు మొరుగుతున్నాయని ఘాటుగా విమర్శించారు. అప్పుడే ఎగిసెగిసి పడవద్దని…. కాస్త వేచి చూడాలని సూచించారు.
ప్రజలు మిమ్మల్ని చెప్పుతీసుకొని కొట్టినా మీకు బుద్ధి రాలేదు… ఇక రాదు కూడా అని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ రాజకీయంగా చచ్చిపోయిందని… ఆ కారణంగానే ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలే ఉంటుందని ఒకరు… ఆరు నెలలే ఉంటుందని మరొకరు… ఎప్పుడు పడిపోతుందో తెలియదని ఇంకొకరు అంటారని… ఇవేం మాటలు? అని నిలదీశారు.
మీ బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయి చేస్తోన్న విమర్శలకు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే మౌనంగా ఉంటున్నారని తెలిపారు. ప్రజల ముందు మిమ్మల్ని ముద్దాయిగా నిలబెట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని.. అందుకే వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారన్నారు. మీరు రెండు నెలలకే తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారంటే ఎంత ఒత్తిడిలో ఉన్నారో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని తన్ని తరిమేసేవరకు మీకు బుద్ధి వచ్చేలా కనిపించడం లేదని విమర్శించారు. ఇలాంటి చిల్లర నాయకులు మన రాష్ట్రాన్ని పాలించి… నాశనం చేశారని ధ్వజమెత్తారు. ఒక్కొక్కరిని తెలంగాణ నుంచి తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి… తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదు: మల్లు రవి
బాల్క సుమన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదని… చాలా సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యేలా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారి తీరు ప్రజలు అసహ్యించుకునేలా ఉందన్నారు. ఇలాంటి నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వారు ఇప్పటికైనా మారాలని హితవు పలికారు.