కర్నూలు జిల్లా, ఆదోని: పట్టణంలోని క్రాంతి నగర్ కు చెందిన సాయి లలిత అనే గర్భిణీ , మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో సమయానికి ఆటో లేక పోవడంతో చేసేదేమీ లేక ద్విచక్ర వాహనంపై ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రికి కాన్పుకు బయలుదేరారు. పాత బ్రిడ్జి మీద వస్తుండగా దారిలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో మార్గమధ్యలో గర్భిణీకు పురిటి నొప్పులు అధికమై ఒక బిడ్డ బయటకు వచ్చింది. వెళ్లాల్సిన ఆసుపత్రి దూరంగా ఉండటంతో చాకచక్యంగా ఆలోచించి అక్కడే ఉన్న ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి వెళ్లారు. విధుల్లో ఉన్న గైనిక్ వైద్య నిపుణులు వేగంగా స్పందించి ఇంకో బిడ్డకు ప్రసవం చేశారు. మెరుగైన చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ మాతా, శిశు ఆస్పత్రికి తరలించారు. తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉండటంతో కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు.