చైనాలోని వుహాన్ నగరం మరోసారి లాక్ డౌన్ గుప్పిట్లోకి వెళ్లింది. ప్రపంచదేశాలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారికి వుహాన్ నగరమే పుట్టినిల్లు అని తెలిసిందే. వుహాన్ లో ఇప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి. నిన్న ఒక్కరోజే వుహాన్ లో 18 కొత్త కేసులు గుర్తించారు.
దాంతో, నగరంలో లాక్ డౌన్ ప్రకటించారు. కేవలం అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. మెడికల్ షాపులు, సూపర్ మార్కెట్లు తెరిచే ఉంటాయి. ఆదివారం వరకు ఇవే ఆంక్షలు కొనసాగుతాయని వుహాన్ అధికారులు తెలిపారు.
2019 చివర్లో కొవిడ్ మహమ్మారి వుహాన్ లోనే వెలుగుచూసింది. కొద్దికాలంలోనే చైనా సరిహద్దులు దాటి ఇతర దేశాలకు వ్యాపించిన ఈ రాకాసి వైరస్ ప్రజల ప్రాణాలను కబళిస్తూ, ప్రపంచవ్యాప్తంగా భయానక వాతావరణం సృష్టించింది. చైనాలోనూ పెద్ద సంఖ్యలో కరోనా బారినపడడంతో అక్కడ కఠిన ఆంక్షలు విధించారు.
మొదటి నుంచి జీరో కొవిడ్ పాలసీ అమలు చేస్తున్న చైనా… మారుమూల ప్రాంతాల్లో కొవిడ్ కేసు నమోదైనా సరే, ఆ ప్రావిన్స్ మొత్తం పరీక్షలు జరిపి, కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటోంది.