అటు కోలీవుడ్ లోను .. ఇటు టాలీవుడ్ లోను అజిత్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతూ ఉంటాయి. ఆయన తాజా చిత్రంగా ‘తునీవు’ రూపొందింది. బోనీకపూర్ నిర్మించిన ఈ సినిమాకి, వినోత్ దర్శకత్వం వహించాడు.
ఎమోషన్ తో కూడిన యాక్షన్ ఎంటర్టయినర్ ఇది. అజిత్ సరసన నాయికగా మంజు వారియర్ కనిపించనుంది. ఇంతకుముందు అజిత్ నుంచి వచ్చిన ‘వలిమై’ అదే టైటిల్ తో తెలుగులో విడుదలై విమర్శలను మూటగట్టుకుంది. అందువలన ‘తునీవు’ సినిమాకు తెలుగులో టైటిల్ ఫిక్స్ చేశారు. ‘తెగింపు’ టైటిల్ ను ఖరారు చేసి కొంతసేపటిక్రితం పోస్టర్ ను వదిలారు.
సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో అజిత్ .. యాక్షన్ మోడ్ లో ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తమిళంలో ‘వరిసు’ .. ‘తునీవు’ ఒకేసారి విడుదలవుతూ ఉండటంతో, అభిమానుల్లో ఆసక్తి పెరుగుతూ పోతోంది. ఇక ఈ రెండు సినిమాలు ఇక్కడ కూడా గట్టిపోటీనే ఎదుర్కోనున్నాయి.