contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

శ్రీవారి భక్తుల ఆకలి తీర్చే అక్షయపాత్ర…

  • తిరుమలలో నిరంతర యజ్ఞంగా అన్నప్రసాద వితరణ
  •  17వ శతాబ్దంలోనే నాంది పలికిన మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ
  • ప్రతిరోజూ దాదాపు 12 టన్నుల బియ్యం, 8 టన్నుల కూరగాయలు వినియోగం
  • అన్న‌దాన ట్ర‌స్టులో రూ.1502 కోట్ల నిధులు.
  • మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన ట్రస్ట్ విశిష్టత పై ప్రత్యేక కధనం.

తిరుమల:  శ్రీవారి భక్తుల ఆకలిని తీర్చే..అక్షయపాత్ర లా… నిరంతర యజ్ఞంగా అన్నప్రసాద వితరణ చేస్తోంది మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన ట్రస్ట్.. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆకలి అనేది తెలియకుండా తిరుమల తిరుపతి దేవస్థానముల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు అల్పాహారాలు, అన్నప్రసాద వితరణ చేస్తోంది. ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ యజ్ఞాన్ని నిరాఘాటంగా సాగిస్తోంది. అయితే తిరుమలలో తొలినాళ్లలో పరిస్థితులు ఎలా ఉండేవి. పూర్తిగా దట్టమైన అడవి మధ్యన ఉండే ఆలయానికి వచ్చే భక్తులకు ఎవరు ఆకలి తీర్చేవారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు కొంతదూరం చరిత్రలో ప్రయాణిస్తే… మనకు ముందుగా దొరికే సమాధానం తరిగొండవెంగమాంబ…. అంతకుముందు ఎందరో రాజులు, చక్రవర్తులు, స్వామివారి నైవేద్యానికి భూరివిరాళాలు ఇచ్చినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయితే భక్తులకోసమే ప్రత్యేకంగా అన్నప్రసాద వితరణ చేసిన ఘనత మాత్రం తరిగొండ వెంగమాంబకే దక్కుతుంది.

17వ శతాబ్దంలోనే నాంది…
శ్రీవారి అపరభక్తురాలైన ఈ తెలుగు కవయిత్రి 17వ శతాబ్దంలో తిరుమలలో భక్తులకు అన్నపసాద వితరణ చేసినట్టుగా ఆధారాలు లభిస్తున్నాయి. ఏటా వైశాఖమాసంలో తిరుమలలో నృసింహజయంతి జరిపే వెంగమాంబ.., పదిరోజులపాటు అన్నప్రసాద వితరణ, చలివేంద్రాలు ఏర్పాటుచేసేవార‌ట‌. ఈ పవిత్ర కార్యక్రమానికి ఆనాటి రాజులు దిండిగల్లు మొదలుకొని ఉత్తారాదిన గోల్కొండ వరకు ఎందరో భూదానాలు చేసినట్టు శాసనాలు తెలుపుతున్నాయి.

అన్న‌ప్ర‌సాదం కాంప్లెక్స్‌లో ఒకేసారి 4 వేల మందికి భోజ‌నం….
తిరుమలలో అన్నప్రసాద వితరణకు నాందిపలికిన తరిగొండ వెంగమాంబ పేరుతో టిటిడి నూతన అన్నప్రసాద భవనాన్ని ప్రారంభించింది. ఆధునిక హంగులతో ఒకేసారి నాలుగు వేల మంది భోజనం చేయగలిగే ఈ భవనాన్ని 2011 జులై 11వ తేదీన అప్పటి రాష్ట్రపతి శ్రీ‌మ‌తి ప్రతిభాపాటిల్‌ ప్రారంభించారు.

గ‌తంలో స్వ‌ల్ప ధ‌ర‌ల‌కు భోజ‌నం….
ఇక 1933లో తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పడిన మూడు దశాబ్దాల తరువాత స్వల్పధరలకే అల్పాహారాన్ని అందించే ఓ క్యాంటీన్‌ను ప్రారంభించారు. అంటే 1965కు పూర్వం ప్రస్తుతం అఖండ హరినామసంకీర్తన జరిగే మండపంలో ఈ క్యాంటీన్‌ను ఏర్పాటుచేశారు. అప్పట్లో ఇడ్లీ 10పైసలు, వడ 15 పైసలు, టీ, కాఫీలు 25పైసలు, మసాలా దోశ 40 పైసలు, భోజనం రూపాయిపావలాకు విక్రయించేవారు. తదుపరి 1970 నుంచి 1980వరకు ఏఎన్‌సి ప్రాంతంలోని ఓ కాటేజీలో ఎస్వీసీసీ పేరుతో అంటే శ్రీవేంకటేశ్వర క్యాంటీన్‌ కాంప్లెక్స్‌ ప్రారంభించారు. ఇక్కడ కూడా స్వల్పధరలకే ఆహారపదార్థాలు విక్రయించేవారు. ఆ తర్వాత 1971లో ప్రముఖులు, భక్తులకోసం మార్చి 31, 1971లో ఎస్వీ గెస్ట్‌ హౌస్‌ను అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఇందులో టిటిడి ప్రత్యేకంగా క్యాంటీన్‌ను ఏర్పాటుచేసి తక్కువ ధరలకు అల్పాహారాన్ని అందించడంతోపాటు తక్కువ ధరకే భోజన సదుపాయాన్నీ కల్పించింది. అంతేకాదు.. 1981 నుంచి 1984వరకు ఆర్టీసీ బస్టాండ్‌లోని టీటీడీ సెంట్రల్‌ క్యాంటీన్‌ ఏర్పాటుచేసి ప్లేట్‌మీల్స్‌ రూపాయి 75పైసలకు, ఫుల్‌మీల్స్‌ మూడు రూపాయలకు విక్రయించేవారు. ఈ క్రమంలోనే పాత అన్నప్రసాద భవనాన్ని 1980 జూన్‌ 5వ తేదీన అప్పటి ఇఓ పీవీఆర్‌కె ప్రసాద్‌ ప్రారంభించారు. ఈ భవనంలో ప్లేట్‌ మీల్స్‌ రూపాయి 75 పైసలు, ఫుల్‌మీల్స్‌ మూడురూపాయలు, స్పెషల్‌ భోజనం 4.50 రూపాయలకు విక్రయించేవారు. అప్పట్లో ప్రతినిత్యం ఐదువేల భోజనాలను విక్రయించేవారు.

1985లో రూ.10 లక్షలతో అన్నప్రసాద వితరణ ప్రారంభం….
అయితే కొండకు వచ్చే భక్తుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతుండటంతో ఉచిత అన్నప్రసాద వితరణకు టిటిడి శ్రీకారం చుట్టింది. 1985లో అప్ప‌టి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. ఎల్వీ రామయ్య అనే భక్తుడు ఇచ్చిన పది లక్షల రూపాయల భూరివిరాళంతో టిటిడి ఉచిత అన్నప్రసాద వితరణకు శ్రీకారం చుట్టింది. అప్పట్లో పరిమిత సంఖ్యలో మాత్రమే ఉచితభోజనం లభించేది. శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులకు మాత్రమే ఆలయంలో ఉచితభోజనం టోకెన్లు అందించేవారు. తొలుత రెండువేలమందికి మాత్రమే భోజనం అందిస్తుండగా క్రమంగా ఈ సంఖ్య 14 వేలకు, అక్కడ నుంచి 20 వేల మందికి పెరిగింది. ఈ భవనంలో రెండు హాల్స్‌ ఉండటంతో ఒక్కో హాల్‌లో వెయ్యిమంది చొప్పున విడతకు రెండు వేల మంది భోజనం చేసేవారు. ఇలా ప్రారంభమైన అన్నప్రసాద వితరణ క్రమంగా భక్తుల సంఖ్య ప్రతినిత్యం లక్షకు చేరుకుంటున్న నేపథ్యంలో 2008లో సర్వభోజన పథకానికి శ్రీకారం చుట్టింది. నాటి నుంచి తిరుమలకు వచ్చిన భక్తులందరికీ శ్రీవారి అన్నప్రసాద వితరణను ఉచితంగా కొనసాగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సేవలో తరిస్తోంది.

పలు ప్రాంతాల్లో అన్నప్రసాద వితరణ…
తిరుమలలో మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాదం కాంప్లెక్స్‌తోపాటు నాలుగు చోట్ల అన్నప్రసాదాలు త‌యారు చేస్తారు. వెంగ‌మాంబ కాంప్లెక్స్‌లో కూర, చట్నీ, సాంబార్, రసం, మ‌జ్జిగ‌, చక్కెర పొంగలి అందిస్తారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ -1, 2, వెలుపలి క్యూలైన్లు, పిఏసి-2, ఫుడ్ కౌంట‌ర్ల‌లో సాంబార్ బాత్, ఉప్మా, పొంగలి, పులిహోర అందిస్తారు. తిరుప‌తిలోని మార్కెటింగ్ గోడౌన్ నుండి ప్ర‌యోగ‌శాల‌లో ప‌రిశీలించిన త‌రువాత అన్న‌ప్ర‌సాద విభాగానికి స‌రుకుల‌ను చేర‌వేస్తారు. అన్న‌ప్ర‌సాదాల త‌యారీకి ప్రతిరోజూ దాదాపు 10 నుండి 12 టన్నుల బియ్యం, 7 నుండి 8 టన్నుల కూరగాయలు వినియోగిస్తున్నారు. ఇక్క‌డ శ్రీవారి సేవకులు కూరగాయల త‌ర‌గ‌డం, సరుకులను శుభ్రం చేయడం, యాత్రికులకు ఆహారం అందించడం త‌దిత‌ర సేవ‌లు అందిస్తున్నారు.

అన్న‌దాన ట్ర‌స్టులో రూ.1502 కోట్ల నిధులు…
ప్ర‌స్తుతం సాధార‌ణ రోజుల్లో రోజుకు 55 వేల నుండి 60 వేల మంది భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు అందిస్తున్నారు. ప‌ర్వ‌దినాలు, ర‌ద్దీ రోజుల్లో ఈ సంఖ్య ల‌క్ష వ‌ర‌కు చేరుతుంది. అన్న‌దాన ట్ర‌స్టులో రూ.1502 కోట్ల నిధులున్నాయి. 2018వ సంవ‌త్స‌రంలో ఈ ట్ర‌స్టు స్వ‌యంస‌మృద్ధి సాధించ‌డంతో టిటిడి గ్రాంటు ఆగిపోయింది. భ‌క్తుల‌కు మ‌రింత పోష‌కాల‌తో కూడిన అన్న‌ప్ర‌సాదాలు అందించేందుకు భ‌విష్య‌త్తులో ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా పండించిన కూర‌గాయ‌లు అందించాల‌ని దాత‌ల‌ను టిటిడి కోరుతోంది. సాధారణ రోజుల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 9 నుండి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాదవితరణ ఉంటుంది. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుండి రాత్రి 11.30 గంటల వరకు అన్నప్రసాద వితరణ చేస్తారు. గరుడసేవనాడు రాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుంది.
ఈ విధంగా అడిగిన వారికి లేద‌న‌కుండా అన్న‌ప్ర‌సాదాలు అందిస్తున్న టిటిడి అన్న‌పూర్ణ‌గా ఖ్యాతిగ‌డిస్తోంది. శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న యాత్రికులకు అక్షయపాత్రగా నిలుస్తోంది. అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ‌లో ఇత‌ర ధార్మిక సంస్థ‌ల‌కు ఆద‌ర్శంగా నిలుస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :