- మొన్న రంగబయలు.. నేడు కుమడ…
- ఏజెన్సీలో నూతన తారు రోడ్ల దుస్థితి
- నాణ్యత లేని రోడ్లు ఎందుకని ప్రజలు గగ్గోలు
అల్లూరి జిల్లా, ముంచంగిపుట్టు, ది రిపోర్టర్ : మండలంలోని మారుమూల రంగబయలు నూతన రోడ్డు కొట్టుకుపోయిన దుస్థితి మరువకముందే రూఢకోట నుంచి కుమడ మీదుగా ఒడిస్సా బోర్డర్ వరకు నూతనంగా వేస్తున్న తారు రోడ్డు వర్షాలకు బీటలువారుతు పెచ్చులూడిపోతుండడంతో ప్రజలు గొగోలు పెడుతున్నారు. 2020 సంవత్సరంలో రూ.1321.20 లక్షలతో రూఢకోటలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ చేతుల మీదుగా శంకుస్థాపన చేసి.. కొన్నాళ్ల తర్వాత పనులు ప్రారంభించారు. గత ఆరు నెలల క్రితం ఒడిస్సా బోర్డర్ నుంచి బురుగుమెట్ట వరకు తారు రోడ్డు పూర్తి చేశారు. ఆ తర్వాత గత నెల బురుగుమెట్ట నుంచి రూఢకోట వరకు తారు రోడ్డు పనులు ప్రారంభించారు. అయితే దాదాపు రూఢకోట వరకు తారు వేయడం పూర్తయింది. కానీ వారం రోజులుగా ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు నూతనంగా వేసిన రోడ్డు బీటలువారుతు పెచ్చులూడిపోతుండడంతో ఆరు పంచాయతీల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలో నూతనంగా వేస్తున్న తారు రోడ్లకు అధికారులు పర్యవేక్షణ లోపమో.. గుత్తేదారుల నిర్లక్ష్యమో తెలియటం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లు మంజూరు చేసినప్పటికీ రోడ్లు నాణ్యత లేకపోతే నిరుపయోగమేనని, కనీసం ఐదు సంవత్సరాలైనా రోడ్లపైకి వాహనాలు తిరగకపోతే ఎలా అని జనాలు మండి పడుతున్నారు. సంబంధిత అధికారులు రోడ్డును పరిశీలించి నాణ్యతగా రోడ్డు నిర్మించి ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.