అమరావతి: చంద్రబాబుతోనే కలిసి పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ చెప్పేశారని.. సత్తెనపల్లి నుంచి బీజేపీకి మెసేజ్ పంపించారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.ఆదివారం ఆయన తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ సిద్ధాంతం ఏంటో అర్థం కావడం లేదన్నారు.
”చంద్రబాబు వెంటే నడుస్తానని పవన్ మరోసారి చెప్పారు. చంద్రబాబును సీఎం చేసేందుకే వచ్చానని పవన్ డైరెక్ట్‌గా చెప్పొచ్చుగా. కలిసి పోటీ చేసి ఉంటే బాగుండేది అంటూ డొంక తిరుగుడు ఎందుకు?. తప్పు చేస్తే చొక్కా పట్టుకోమని పవన్ చెబుతున్నారు. రేపు పొత్తు పెట్టుకున్న రోజే ప్రజలు పవన్ చొక్కా పట్టుకోవడం ఖాయం. పవన్‌కు ఉన్నది చంద్రబాబు ఆలోచనే. ప్యాకేజీ తీసుకుని రాజకీయాలు చేసే వ్యక్తి పవన్ కల్యాణ్” అంటూ మంత్రి దుయ్యబట్టారు.”వారాహి అనేది అమ్మవారి పేరు. వారాహి పేరు మార్చుకోవాలని పవన్‌కు సూచిస్తున్నా. వారాహి కాదు.. నీ వాహనానికి వరాహం అని పేరు పెట్టుకో. వారాహి అమ్మవారి పేరు మార్చుకోకుంటే పవన్ భ్రష్టుపట్టిపోతారు. బీసీల సమావేశంపై పవన్ ఇష్టానుసారం మాట్లాడటం సరికాదు. గత ప్రభుత్వం కంటే బీసీలకు మేలు చేసిన పార్టీ వైఎస్సార్సీపీ. నా మీద పవన్ చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా. నేను కాదు.. పవనే కాపుల గుండెలపై కుంపటి. కాపులను చంద్రబాబుకు తాకట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. చంద్రబాబు పోలవరం గురించి ఏ రోజైనా ప్రశ్నించావా?” అంటూ అంబటి రాంబాబు నిలదీశారు.