- కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కో చైర్మన్ గౌడ పేరు చిట్టిబాబు పిలుపు
తిరుపతి: ప్రపంచం గర్వించదగ్గ మేధావిగా గుర్తింపు పొంది, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తించబడ్డ భారతదేశానికి అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో కృషి చేయాలని పిసిసి ఎస్సీ సెల్ కో చైర్మన్ గౌడ పేరు చిట్టిబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం పేదల పెన్నిధి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఎస్సీ సెల్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు చిత్తూరు శివశంకర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు దొరై రాజ్, గోపి, వై.సుబ్రహ్మణ్యం, చిట్టిబాబు, ఉపాధ్యాయుడు సుబ్రమణ్యం, నరసింహులు, రామచంద్ర, మహిళా నాయకురాలు కస్తూరమ్మ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పైగా అవుతున్న అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీలకు అందని ద్రాక్షగానే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలు ఇప్పటికీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలాలను పొందలేకపోతున్నారని చెప్పారు. దళితులంతా ఐక్యమై రాజ్యాంగఫలాల సాధనకు, రాజ్యాధికారం పొందడానికి ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎస్సీ సెల్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ సమున్నత లక్ష్యంతో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అందరికీ అందేలా కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాజ్యాంగ పరిరక్షణ, ఎస్సీ, ఎస్టీల సంరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. ఈసందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు, ప్రజలకు పంచిపెట్టారు.