సంగారెడ్డి / అమీన్ పూర్ : వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మున్సిపల్ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తెలిపారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో సీజనల్ వ్యాధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా రేపటి నుండి ప్రతి రోజు సీజనల్ వ్యాధులపై ఇంటింటి సర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎవరికైనా వ్యాధులు ఉంటే సర్వే సిబ్బందికి తెలపాలని, ఇందుకు అనుగుణంగా వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు. ఇంటి పరిసరాల్లో, కాలనీలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ రక్షిత మంచినీరు మాత్రమే తీసుకోవాలని, జ్వరం వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, ఆర్ ఓ మధుసూదన్ రెడ్డి,డాక్టర్ రాధిక, కుశీక్,23వ వార్డ్ కౌన్సిలర్ ఎం డీ జహంగీర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ అంజన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.