40 ఏళ్ళుగా పోరాడుతున్నాం… ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు… ఎన్నో ప్రభుత్వాలు మారాయి…మాకు న్యాయం జరగలేదు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అయినా జోక్యం చేసుకుని మాకు న్యాయం చేయాలంటూ నారాయణ రావు లే అవుట్ బాధితులు వేడుకుంటున్నారు.
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ సర్వే నంబర్ 1000 వివాస్పద భూముల్లో ఇండస్ట్రీయల్ ఎంప్లాయిస్ కో అపరేటివ్ హౌజింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. 1982 లో నారాయణరావు లే అవుట్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన 2000 మంది బాధితులకు చెందిన భూమిలో అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటేందుకు దున్నడంతో డీ ఆర్ ఓ కస్టడీలోని భూములను అటవీ శాఖకు ఎలా కేటాయిస్తారని ప్లాట్ ఓనర్లు ప్రశ్నిస్తున్నారు. కాయకష్టం చేసి ప్లాట్లను కొనుక్కున్నామని, తమ ప్లాట్లను తమకు కేటాయించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్, రెవెన్యూ మంత్రి స్పందించి న్యాయం చేయాలని కోరారు. ప్లాట్ల ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడు అరుసుమల్లి వెంకటేశ్వర రావు, ప్లాట్ ఓనర్లు పాల్గొన్నారు.