అమెరికాలో బాంబ్ సైక్లోన్ (మంచు తుపాను) బీభత్సం సృష్టిస్తోంది. ఆరిజోనా వద్ద గడ్డకట్టిన సరస్సును దాటే ప్రయత్నంలో గుంటూరు జిల్లాకు చెందిన దంపతులు ముద్దన నారాయణ, హరిత నీటిలో మునిగిపోయారు. హరితను వెలికి తీసిన సహాయ సిబ్బంది… సీపీఆర్ చేసి బతికించేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. విషాదకర రీతిలో ఆమె ప్రాణాలు విడించింది.
సరస్సులో మునిగిపోయిన నారాయణ కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే ప్రమాదంలో ఏపీకి చెందిన మరో వ్యక్తి కూడా గల్లంతు కాగా, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
హరిత, నారాయణ స్వస్థలం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రు గ్రామం. వారిద్దరూ ఈ ఏడాది జూన్ లో స్వగ్రామానికి వచ్చారు. నిన్ననే కుటుంబ సభ్యులతో ఫోన్ లో కూడా మాట్లాడారు. అంతలోనే ఈ ఘోరం జరగడంతో వారి కుటుంబంలోనూ, గ్రామంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. హరిత, నారాయణ దంపతులకు ఇద్దరు సంతానం.