నాలుగేళ్ల జగన్ పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్ప మరేం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉందని.. రైతు ఆత్మహత్యలపై జగన్ సర్కార్ సిగ్గుపడాలంటూ పేర్కొన్నారు. కేంద్ర పథకాలకు జగన్ తన ఫొటోను వేసుకుంటూ తన పేరుతో ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. విశాఖపట్నంలోని రైల్వే మైదానంలో జరిగిన బీజేపీ భారీ బహిరంగ సభలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. అల్లూరు సీతారామరాజు, విజయనగర రాజులను స్మరిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన అమిత్ షా.. జగన్ ప్రభుత్వం అవినీతి తప్ప మరేం చేయలేదంటూ విమర్శలు గుప్పించారు.
రైతుల సంక్షేమ ప్రభుత్వం అని జగన్ చెబుతున్నారు.. అది నిజం కాదంటూ అమిత్ షా ఫైర్ అయ్యారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బును తామే ఇస్తున్నట్లు జగన్ చెబుతున్నారు.. ఉచితంగా ఇచ్చే బియ్యంపైనా జగన్ ఫొటోలా.. అంటూ అమిత్ షా ప్రశ్నించారు. జగన్ పాలనలో విశాఖపట్నం అరాచక శక్తులకు అడ్డాగా మారిందని.. కబ్జాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఏపీ అభివృద్ధికి పదేళ్లలో రూ.5 లక్షల కోట్లు ఇచ్చామని.. అన్ని లక్షల కోట్ల అభివృద్ధి రాష్ట్రంలో కనిపిస్తుందా..? అంటూ అమిత్ షా ప్రశ్నించారు. ఆ డబ్బంతా జగన్ ప్రభుత్వ అవినీతి ఖాతాల్లోకే వెళ్తోందని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.
కేంద్రం ఇస్తున్న డబ్బులను రైతు భరోసా పేరుతో ఇక్కడ ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అమిత్ షా విమర్శించారు. కేంద్రం ఇస్తున్న ఇళ్ళను తమ పథకంగా చెప్పుకొంటున్నారన్నారు. రేషన్ బియ్యం మోదీ ఇస్తుంటే.. జగన్ తన బొమ్మ వేసుకుంటున్నారని దుయ్యబట్టారు. పంటలకు మద్దతు ధర కూడా పెంచామని గుర్తుచేశారు. తమను ఆదరిస్తే.. ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అమిత్ షా ఈ సందర్భంగా హామీ ఇచ్చారు
విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు చేపట్టామని.. ఏపీకి రెండు వందే భారత్ రైళ్లను ఇచ్చామని.. ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. భోగాపురం విమానాశ్రయానికి కేంద్రం అనుమతులు ఇచ్చిందని పేర్కొన్న అమిత్ షా విశాఖ, కాకినాడ, తిరుపతి, అమరావతిని స్మార్ట్ సిటీలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కబ్జాలకు పాల్పడుతున్నారని, మైనింగ్, ఫార్మా స్కాంలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రధాని మోడీ వచ్చాక మనదేశం పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోందని.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మోడీ నినాదమే వినిపిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. 2024 బీజేపీదే అధికారమని.. 300 స్థానాలతో మోడీ మళ్లీ ప్రధాని అవుతారని అమిత్ షా పేర్కొ్న్నారు. ఏపీ నుంచి కూడా 20 సీట్లు ఇవ్వాలంటూ అమిత్ షా ప్రజలను కోరారు.
మోదీ ప్రధానమంత్రి అయ్యాక భారత సైన్యం బలం మరింత పెరిగిందన్నారు. పాక్‌లోకి చొరబడి మరీ శత్రువులకు సమాధానం ఇచ్చామని అమిత్ షా గుర్తు చేశారు. యూపీఏ పాలనలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని.. మోదీ 9 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణలు కూడా రాలేదంటూ పేర్కొన్నారు.