ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి లో పుష్ప అనే యువతి తన కాబోయే భర్త గొంతుకోసిన ఘటన సంచలనం సృష్టించింది. పుష్పను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు.
డీఎస్పీ సునీల్ మీడియా సమావేశం లో మాట్లాడుతూ పెళ్లి ఇష్టంలేకనే కాబోయే భర్తపై దారుణానికి పాల్పడిందని తెలిపారు. రాము నాయుడు అనే యువకుడితో పుష్పకు మే 20న పెళ్లి నిశ్చయం చేశారని ,పెద్దవాళ్ల అనుమతితో అమ్మాయి, అబ్బాయి స్కూటీపై బయటికి వెళ్లారని, వడ్డాది వద్ద స్కూటీ ఆపిన యువతి గిఫ్ట్ కొంటానని షాపులోకి వెళ్లిందని పేర్కొన్నారు. షాపులో ఏం కొన్నావని రాము నాయుడు అడిగితే, పుష్ప ఏం సమాధానం చెప్పలేదని తెలిపారు. అక్కడ్నించి ఆ అబ్బాయిని విశ్వశాంతి జ్యోతిర్మయి ఆశ్రయం వద్దకు తీసుకెళ్లిందని, బహుమతి ఇస్తాను కళ్లు మూసుకోమని చెప్పిందని, అతడు సరిగా కళ్లు మూసుకోకపోవడంతో తన చున్నీ తీసి అతడి కళ్లకు గంతలు కట్టి ఆ తర్వాత తనతో తెచ్చుకున్న చాకుతో అబ్బాయి గొంతు కోసిందని తెలిపారు. పెళ్లి ఇష్టంలేకనే గొంతు కోసినట్టు అబ్బాయితో చెప్పిందని తెలిపారు. అయితే, పెళ్లి ఇష్టంలేదని అంటుండడంతో ఆత్మహత్య చేసుకుంటుందేమోనని ఆమెతో ఆ యువకుడు కూడా గాయంతోనే బయల్దేరాడని డీఎస్పీ పేర్కొన్నారు. ఆ యువకుడు గొంతు నుంచి తీవ్ర రక్తస్రావం అవుతుండడం గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రిలో చేర్చారని వెల్లడించారు.
కాగా, ఎవరినీ పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని ఆ యువతి చెప్పిందని, దైవ చింతనతో జీవితం గడపాలని ఆ యువతి భావిస్తోందని డీఎస్పీ వివరించారు. ఓం శాంతి ఆశ్రమంలో గడపాలని ఆమె కోరుకుంటోందని చెప్పారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆశ్రమంలో గడపడానికి పెద్దలు ఒప్పుకోరని భావించి కాబోయే భర్తపై దాడి చేసిందని తెలిపారు. యువతిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని డీఎస్పీ సునీల్ చెప్పారు.