contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బాబూ పులివెందుల ఎమ్మెల్యే… నీకంత సీన్ లేదు !: హోం మంత్రి అనిత

జగన్ కు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారని, చంద్రబాబు పదేళ్ల పాటు వాడిన వాహనాన్ని కనీసం మరమ్మతులు కూడా చేయించుకుండా జగన్ కు కేటాయించారని వైసీపీ చేసిన ఆరోపణలపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. బాబూ పులివెందుల ఎమ్మెల్యే… నువ్వు ఇంతకుముందు ఓసారి ఏం చేశావో గుర్తుకు తెచ్చుకోవయ్యా… అంటూ ధ్వజమెత్తారు.

గతంలో చంద్రబాబుకు ఏ బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారో, ఇప్పుడదే కారును జగన్ కు ఇచ్చామని అనిత స్పష్టం చేశారు. చంద్రబాబుకు పాత వాహనం ఇచ్చింది నువ్వు… ఇప్పుడదే వాహనాన్ని నీకు ఇస్తే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నావు అంటూ మండిపడ్డారు.

“సాక్షి పేపర్లో ఇవాళ జగన్ కు వచ్చి వెహికిల్ గురించి మాట్లాడారు. అదొక పాంప్లెట్ పేపరు. జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ కేవలం పులివెందుల ఎమ్మెల్యే. కేవలం ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నందున జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు. టాటా సఫారీ వాహనం ఇచ్చారని తెగ బాధపడిపోయావు. నీకున్న ఆస్తికి టాటా సఫారీ అంటే లెక్కలేదనుకో… అది వేరే విషయం.

కానీ 2019లో నువ్వు సీఎం అయ్యాక, మాజీ సీఎంగా ఉన్న చంద్రబాబుకు నువ్వు ఇచ్చింది టాటా సఫారీ వాహనమే. ఇవాళ మేం నీకు ఇచ్చింది కూడా టాటా సఫారీయే. ప్రభుత్వం మీద బురద చల్లాలన్న ఉద్దేశంతోనే, వెహికిల్ కూడా సరైనది ఇవ్వలేదని నువ్వు సృష్టించిన డ్రామా ఇది.

ఇవాళ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ హైదరాబాద్ వెళ్లినా, ఢిల్లీ వెళ్లినా టాటా సఫారీ వాహనమే ఉపయోగిస్తారు. మాజీ సీఎంగా ఉన్న నీకు కూడా టాటా సఫారీ వాహనమే ఇచ్చారు కదా… నీకు ఎక్కడ తక్కువ చేశారు? ఆ కారు నీకు నచ్చలేదంతే!

ఎందుకు నచ్చలేదంటే… బయటున్న ప్రజలు నీకు కనిపించడంలేదు, నీ హావభావాలు బయటున్న వారికి కనిపించడంలేదు, నీలో ఉన్న మహానటుడు కనిపించడంలేదని బాధపడిపోయి, టాటా సఫారీ కారు దిగి వేరే కారు ఎక్కావు. నువ్వు వేరే కారు ఎక్కినా కూడా ఆ టాటా సఫారీ కారు నీ వెనుకే కాన్వాయ్ లో వచ్చింది.

ఎక్కడా ప్రోటోకాల్ ఉల్లంఘించలేదు, ఎక్కడా నీకు సెక్యూరిటీ తగ్గించలేదు, నిన్నెవరూ ఇబ్బంది పెట్టలేదు, నీ ఇంటి మీద ఎవరూ దాడికి రాలేదు, నువ్వెక్కడికైనా వెళతానంటే పోలీసులతో తాళ్లు కట్టలేదు. మరి ఎక్కడ అటవిక పాలన జరిగిందో నువ్వు, నేను చర్చించుకోవాలి” అంటూ అనిత తీవ్రస్థాయిలో స్పందించారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :