తిరుమల: పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనలను అర్థ తాత్పర్యాలతో ప్రజలందరికీ చేరువ చేసేందుకు టీటీడీ కృషి చేస్తోందని టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి పేర్కొన్నారు. తాళ్లపాక అన్నమాచార్యుల 614వ జయంతిని పురస్కరించుకొని తిరుమల అన్నమయ్య భవన్ లో శుక్రవారం “అన్నమయ్య సంకీర్తన లహరి గ్రంథం -2 ” ఈవో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ తాళ్ళపాక అన్నమయ్య శ్రీవారిపై 32 వేలకు పైగా సంకీర్తనలు రచించినట్లు తెలిపారు. అన్నమయ్య సంకీర్తనలలో ప్రతి సంకీర్తనకు అర్థ తాత్పర్యాలు, ఆ సంకీర్తన ఏ సందర్భంలో రాశారు, మూలం ఏమిటి అనే విశేష అంశాలు తెలిస్తే గాయకులు భావ భావయుక్తంగా ఆలపిస్తారన్నారు. శ్రీవారి అనుగ్రహంతో 1922 నుంచి 2022 వరకు అంటే దాదాపు వంద సంవత్సరాల తర్వాత స్వామివారి అనుగ్రహంతో అన్నమయ్య రచించిన సంకీర్తనలకు అర్థ తాత్పర్యాలతో భక్తుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం కలిగిందన్నారు. 16 మంది నిష్ణాతులైన ప్రముఖ పండితులు అన్నమయ్య సంకీర్తనలకు అర్థ తాత్పర్యాలు, విశేష అర్థాలను సమకూర్చారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ నరసింహ కిషోర్, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్. విభీషణ శర్మ, టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్,ప్రముఖ పండితులు సర్వోత్తమరావు శ్యామలానందప్రసాద్,పేరం నాయుడు, ఆచార్య రామకృష్ణ, గ్రంథ రచనకు ఆర్థిక సహకారం అందించిన గ్రంథి రాజేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.