- రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో ప్రగతిలో ఉన్న రహదారుల నిర్మాణం, విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రగతిలో ఉన్న పనుల రహదారుల పురోగతిపై అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీటీడీఏ నిధులు 9 కోట్ల 95 లక్షల రూపాయలతో వేములవాడ – వట్టెంల 4 వరుసల రహదారి 700 మీటర్ల మేర విస్తరణ, వేములవాడ – కోరుట్ల 4 వరుసల రహదారి 600 మీటర్ల మేర విస్తరణ, డ్రైనేజీ నిర్మాణ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసే విధంగా చూడాలని, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని దాని ప్రకారం ముందుకు సాగాలని అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో 1.6 కిలోమీటర్ మేర నిర్మిస్తున్న 4 వరుసల సీసీ రోడ్డు నిర్మాణ పనుల పురోగతి గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇండ్లను కూల్చి వేసే ప్రక్రియ ప్రారంభమైందని అధికారులు కలెక్టర్ కు వివరించారు. రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను రోడ్డు చివరికి షిఫ్టింగ్ చేయాలని సెస్ అధికారులను ఆదేశించారు. ఆర్&బి ఈఈ క్షేత్ర స్థాయిలో మిషన్ భగీరథ, సెస్ అధికారులతో కలిసి పరిశీలించి, రోడ్డు నిర్మాణం వేగవంతం చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.జిల్లెల్ల – ముస్తాబాద్ రహదారి పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 3 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం కోసం అటవీ శాఖ నుండి అనుమతి రావాల్సి ఉందని, దీనికోసం తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.రగుడు – వెంకటాపూర్ బైపాస్ రహదారి వెంబడి మెడికల్ కళాశాల సమీపంలో 2.2 కోట్ల రూపాయలతో నిర్మించే అతిథి గృహం టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, పనులు ప్రారంభించే విధంగా చూడాలని ఆర్&బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో ఆర్డీఓ ఎన్.ఆనంద్ కుమార్, వీటీడీఏ కార్యదర్శి సమ్మయ్య, ఆర్&బి ఈఈ శ్యామ్ సుందర్, జిల్లా పంచాయితీ అధికారి రవీందర్, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ జానకి, సెస్ ఎండీ సూర్యచంద్రరావు, వీర్నపల్లి తహశీల్దార్ ఉమారాణి, తదితరులు పాల్గొన్నారు.