గత వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో చెత్తపై పన్ను విధించిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని కూటమి ఎన్నికల వేళ ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో, నేడు చెత్త పన్ను రద్దు బిల్లును ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వం చెత్త సేకరణకు పన్ను విధించిందని అన్నారు. రాష్ట్రంలోని 40 మున్సిపాలిటీల పరిధిలో పన్ను వసూలు చేసిందని తెలిపారు. చెత్త సేకరణకు నెలకు రూ.51,641 నుంచి రూ.62,964 వరకు చెల్లించారని ఆరోపించారు.
నివాస గృహాల నుంచి నెలకు రూ.30 నుంచి రూ.120 వరకు సేకరించారని… కమర్షియల్ కాంప్లెక్స్ ల నుంచి రూ.100 నుంచి రూ.10 వేల వరకు సేకరించారని వెల్లడించారు. చెత్త పన్నును నిరసిస్తూ మహిళలు నాడు ధర్నాలు కూడా చేశారని మంత్రి నారాయణ వివరించారు. పన్ను చెల్లించలేదని తాగునీటి సరఫరా నిలిపివేయడాన్ని కూడా మనం గతంలో చూశామని పేర్కొన్నారు.
చెత్త పన్ను తొలగిస్తామని తాము ఎన్నికల్లో హామీ ఇచ్చామని, ఆ మేరకు ఇప్పుడు మాట నిలబెట్టుకుంటున్నామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.