contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

AP Capital Issue: సుప్రీంకోర్టులో రాజధాని అమరావతి విచారణలో మరో ట్వీస్ట్ వేరే బెంచ్ కు బదిలీ.. విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలన్న ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మంగళవారం ఈ కేసుపై విచారణ జరుగుతుందని అంతా భావించారు. వాస్తవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యూయూ.లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు కేసు విచారణ జరగాల్సి ఉంది. అయితే ఈకేసు విచారణను వేరే బెంచ్ కు బదిలీ చేస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. కేసు విచారణ నుంచి వైదొలగుతున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ.లలిత్ నిర్ణయించారు. దీంతో వేరే బెంచ్ ముందు విచారణ చేయాలని సూచించారు. వీలైనంత త్వరగా విచారాణకు అనుమతివ్వాలని జస్టిస్ లలిత్ కోరారు. దీంతో వేరే బెంచ్ ముందు ఈ కేసు విచారణ జరగనుంది. దీనికి కొద్ది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని గతంలో హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు విచారించాలని తొలుత నిర్ణయించారు. తాజాగా జస్టిస్ లలిత్ ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవడంతో వేరే ధర్మాసనం ముందు విచారణకు రానుంది..

ఏపీ ప్రభుత్వ వాదన..

హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం కోరుతుంది. వికేంద్రీకరణ తమ విధానమని, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూలు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని రాష్ట్రప్రభుత్వం బలమైన వాదనలు వినిపిస్తోంది. కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోవడం లేదని ప్రభుత్వం వాదిస్తోంది. ఒకేచోట నిధుల కేంద్రీకరణతో ప్రాంతీయ అసమానతల పెరిగే అవకాశం ఉందని, విభజన చట్టం, రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వానికే సర్వాధికారం ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా రాజధాని మార్పు అనివార్యమంటోంది. రాజధాని భూ సమీకరణలో అవకతవకలు జరిగాయని, అమరావతిలో రాజధాని నిర్మాణానికి రూ.1,09,000 కోట్లు అవసరం
అని, రాజధాని వికేంద్రీకరణ ఖర్చు రూ.2000 కోట్ల రూపాయలు మాత్రమే అని ప్రభుత్వం చెబుతోంది. రైతులతో జరిగిన అభివృద్ధి ఒప్పందాల్లో ఉల్లంఘనలు జరగలేదుని అంటోంది..

అమరావతి రైతుల వాదన..

ప్రభుత్వ వాదనపై అమరావతి రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసా గించాలని రైతులు కోరుతున్నారు. ప్రాంతాల మధ్య వైసీపీ చిచ్చు పెడుతోందని ఆరోపిస్తున్నారు. విభేదాలు సృష్టించేందుకే మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు అమరావతి రైతులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిపై కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని, పాదయాత్రను అడ్డుకోవడం, దాడులు చేయడం మానుకోవాలని రైతులు అంటున్నారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని ఉండాలని రైతుల డిమాండ్‌ చేస్తున్నారు. హైకోర్టు తీర్పుని వైసీపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని, ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగడతామని రైతులు చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం, అమరావతి రైతులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సుప్రీకోర్టు ఈ కేసులో ఎటువంటి తీర్పు వెలువరిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :