కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ (ఏపీసీసీ) అధ్యక్షుడు సాకే శైలజానాథ్ శనివారం ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడిన వారు తిరిగి పార్టీలోకి చేరవచ్చంటూ ఆయన ప్రకటించారు. ఈ విషయంలో నేతలపై ఎలాంటి షరతులు విధించబోమని కూడా ఆయన అన్నారు. శైలజానాథ్ ప్రకటనపై ఏపీ కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చకు తెర లేసింది.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇటీవలే ఏపీలో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పార్టీ బలహీనంగా ఉన్న విషయంపై యాత్రలో భాగంగా చర్చ జరగగా… పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ రాహుల్ ఆదేశించినట్లు సమాచారం. అంతేకాకుండా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను కూడా పార్టీ పెద్దలు శైలజానాథ్ కు సూచించినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే పార్టీని వీడిన నేతలను తిరిగి పార్టీలోకి రప్పించే దిశగా ఆయన ఈ ప్రకటన చేసి ఉంటారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.