contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

లోన్ యాప్ ల వేధింపులతో ఆత్మహత్యలకు పాల్పడవద్దు – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి కే.వి.రాజేంద్రనాథ్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి శ్రీ కే.వి. రాజేంద్రనాథ్ రెడ్డి విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయాన్ని నవంబరు
14న సందర్శించి, మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డిజిపి కే.వి. రాజేంద్రనాథ్ రెడ్డి
మాట్లాడుతూ – జిల్లాలో నమోదైన వివిధ కేసులను సమీక్షించామని, చాలా వరకు నేరాల సంఖ్య గణనీయంగా
తగ్గిందన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలను నిరోధించేందుకు దిశ యాప్ పట్ల ప్రజలకు విస్తృతంగా అవగాహన
కల్పించేందుకు చర్యలు చేపట్టి, ఎక్కువ మహిళలు తమ మొబైల్స్ దిశ యాప్ను డౌన్లోడు చేసుకొని, రిజిస్ట్రేషను
చేసుకొనే విధంగా చర్యలు చేపట్టామన్నారు. నాటుసారా తయారు చేస్తున్న గ్రామాలను గుర్తించి, నాటుసారా తయారు
చేస్తున్న వ్యక్తులు శాశ్వతంగా సారా వ్యాపారాలకు స్వస్తి పలికి, వేరే వృత్తులతో పునరావాసం కల్పించేందుకు గ్రామ
స్ధాయిలో సర్వేలు నిర్వహించి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ప్రభుత్వం కూడా గ్రామాల్లో నాటుసారా
నిర్మూలనే లక్ష్యంగా బిసి, ఎస్సీ కార్పోరేషను, వివిధ స్కీములతో 3,400 కుటుంబాలకు పునరావాసం కల్పించే విధంగా
కృషి చేస్తుందన్నారు. అవినీతిని నిర్మూలించేందుకు ప్రభుత్వం రూపొందించిన 14400 మొబైల్ యాప్ సేవలను ప్రజలు
సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ యాప్ కు వచ్చిన ఫిర్యాదులపై ఇప్పటికే 58 కేసులు నమోదు చేసామన్నారు.
లోను యాప్ ల మోసాలను నియంత్రించేందుకు పోలీసుశాఖ ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు
చర్యలు చేపడుతున్నదన్నారు. లోను యాప్ ల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని, అవగాహన లేకుండా
వారు అడిగే వాటన్నింటికి అనుమతులు ఇవ్వొద్దన్నారు. రుణాలు తీసుకొనే క్రమంలో వారు అడిగిన వాటన్నింటికి
అనుమతులు ఇవ్వడంతో మన ఫోటోలు, లొకేషను, కాంటాక్ట్ నంబర్లు తదితర డేటా అంతా వారి చేతుల్లోకి వెళ్ళి
పోతుందన్నారు. ఇలా పొందిన డేటాతో వారు రుణగ్రహీతల ఫోటోలను మార్ఫింగ్ చేసి, బెదిరింపులకు పాల్పడుతూ,
అధిక వడ్డీలతో మంజూరు చేసిన రుణాలు వసూలు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తూ, వేధింపులకు పాల్పడుతున్నా
రన్నారు. బ్యాంకు అధికారులు కూడా అనధికార వ్యక్తులు బ్యాంకు ఖాతాలు తెరిచే సమయంలోను అప్రమత్తంగా
వ్యవహరించాలని, ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు చేసే ఖాతాలపై నిఘా పెట్టాలన్నారు. రుణ యాప్ల
వేధింపులు కారణంగా ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, సకాలంలో ఫిర్యాదు చేస్తే, వారిపై చర్యలు చేపడతా
మన్నారు. గంజాయి నిర్మూలనకు పోలీసుశాఖ సమర్ధవంతంగా చర్యలు చేపట్టిందన్నారు. పోలీసుశాఖ చేపట్టిన చర్యలు
ఫలితంగా చాలా వరకు ఏజన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు లేకుండా నియంత్రించామన్నారు. అంతేకాకుండా,
గిరిజనులు గంజాయికి బదులుగా వేరే పంటలతో లబ్ధి పొందే విధంగా ఉచితంగా విత్తనాలను పంపిణీ చేస్తున్నా
మన్నారు. గంజాయి అక్రమ రవాణను నియంత్రించేందుకు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, ఆకస్మికంగా వాహన, లాడ్జి
తనిఖీలు చేపడుతున్నామని, అనుమానితులను అదుపులోకి తీసుకొని, వివరాలను రాబడుతున్నామన్నారు. మన రాష్ట్రం
వలే ఇతర రాష్ట్రాల్లో కూడా గంజాయిని నియంత్రించేందుకు ఆయా ప్రభుత్వాలు చర్యలు చేపట్టినట్లయితే రానున్న 3-4
సంవత్సరాల్లో గంజాయి అక్రమ రవాణను పూర్తిగా నియంత్రించవచ్చునన్నారు. మావోయిస్టు కార్యకలాపాలు ఎఓబిలో
ఉన్నాయని, వారి చర్యలను నియంత్రించేందుకు ఎప్పటిలాగే పోలీసుశాఖ చర్యలు కొనసాగిస్తుందన్నారు. జిల్లాల
పునర్విభజనతో ఏర్పడిన ఇబ్బందులను ఇప్పటికే చాలా వరకు పరిష్కరించామన్నారు. సిబ్బంది, వాహనాలు, మౌళిక
వసతుల కల్పన వంటి అంశాల్లో చాలా వరకు సమస్యలు లేకుండా పరిష్కరించామన్నారు. పోలీసు నియామకాల్లో
ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం కొన్ని అంశాలను పరిశీలిస్తుందని, త్వరలో దీనిపై ప్రభుత్వం ప్రకటన
చేస్తుందని రాష్ట్ర డిజిపి కే.వి. రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

ఈ మీడియా సమావేశంలో శాంతిభద్రత విభాగం అదనపు డిజి డా. రవిశంకర్ అయ్యన్నార్, విశాఖపట్నం
రేంజ్ డిఐజి ఎస్. హరికృష్ణ, జిల్లా ఎస్పీ ఎం. దీపిక పాటిల్ పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం,
విజయనగరం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :