ఆంధ్రప్రదేశ్ లో దీపావళి నుంచి ప్రారంభం కానున్న ఉచిత గ్యాస్ పంపిణీపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈరోజు సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్స్ ఉంటాయన్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి వినియోగదారులు బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయిల్ కంపెనీలకు రూ. 894 కోట్లు అందిస్తాం. ఈ నెల 29న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆయిల్ కంపెనీలకు చెక్కు అందజేస్తాం. సిలిండర్ బుక్ చేసుకోగానే ప్రజలకు ప్రభుత్వం నుంచి సమాచారం వెళ్తుంది.
బుకింగ్ అయిన 24 నుంచి 48 గంటల్లో సిలిండర్‌ను అందిస్తామని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. అదే పట్టణాల్లో అయితే కేవలం 24 గంటల్లోనే డెలివరీ చేస్తామన్నాయి. సిలిండర్ అందిన క్షణం నుంచి 48 గంటల్లోపు వారి ఖాతాల్లో నగదు జమ కావడం జరుగుతుంది. అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.