మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈవీఎం ధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి ఈ మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆయన కోరారు. ఈ అత్యవసర పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారించనుంది. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. నేరం రుజువైతే గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. పిన్నెల్లి, తన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన కోసం ఎనిమిది పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఆయన నరసరావుపేట కోర్టు వద్ద లొంగిపోతారని భావించగా, ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది.