- నిషేధ భూముల జాబితా 22(ఏ)1(ఇ) కేసుల పరిష్కారం రాష్ట్రస్థాయిలోనే జరగాలని, త్రిసభ్య కమిటీయే వాటిని పరిష్కరించాలని హైకోర్టు ధర్మాసనం 2015 లోనే విస్పష్ట తీర్పు ఇచ్చింది.
- రాష్ట్ర నిషేధ భూములపై రాష్ట్ర స్థాయి కమిటీ ఏదీ?
- అందులో రిటైర్డ్ జిల్లా జడ్జిని ఎందుకు నియమించరు?
- 26 జిల్లాల్లో ఏడింటికే మాజీ న్యాయాధికారులతో కమిటీలు
- విశాఖ పక్కనే ఉన్న విజయనగరాన్ని ఎందుకు మినహాయించారు?
- రెవెన్యూ నిపుణుల విస్మయం .. భోగాపురం భూముల సెటిల్మెంట్ కోసమే!
అమరావతి: నిషేధ భూముల జాబితా 22(ఏ)1(ఇ) కేసుల పరిష్కారం రాష్ట్రస్థాయిలోనే జరగాలని, త్రిసభ్య కమిటీయే వాటిని పరిష్కరించాలని హైకోర్టు ధర్మాసనం 2015లోనే విస్పష్ట తీర్పు ఇచ్చింది. రాష్ట్ర స్థాయి కమిటీలో రిటైర్డ్ జిల్లా జడ్జికి చోటు కల్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ), సర్వే కమిషనర్‌తోపాటు ఒక రిటైర్డ్ జిల్లా జడ్జితో కమిటీని ఏర్పాటు చేస్తూ నాటి సర్కారు 2016లోనే జీవో 300 జారీ చేసింది. గుంటూరుకు చెందిన ఓ రిటైర్డ్ జడ్జిని సభ్యుడిగా నియమించింది కూడా. అయితే కొన్ని కారణాలతో ఆయన రాజీనామా చేశారు. ఈలోగా రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయి. జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక.. ఈ త్రిసభ్య కమిటీని పునర్వ్యవస్థీకరించాలని హైకోర్టులో ప్రభుత్వ భూముల(రెవెన్యూ) కేసులు వాదించే న్యాయవాది అప్పటి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏకు లేఖ రాశారు.
రిటైర్డ్ జిల్లా జడ్జి ర్యాంకు న్యాయాధికారి లేకుండా 22(ఏ)1(ఇ) కేసులు సెటిల్ చేస్తున్నారని.. అవి న్యాయ పరిశీలనలో నిలబడవని, పైగా అలా చేయడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని అందులో హెచ్చరించారు. ఇదే అంశాన్ని గుర్తుచేస్తూ మరో రెండు లేఖలు రాశారు. కానీ ఇప్పటి వరకు సర్కారు ఈ అంశంపై స్పందించలేదు. ఇటీవల నిషేధ భూముల కేసుల పరిష్కారాన్ని పూర్తిగా జిల్లా కలెక్టర్లకు బదిలీచేస్తూ రెవెన్యూశాఖ ఆదేశాలిచ్చింది. అంటే కీలక కేసుల పరిష్కారం కలెక్టర్లకే అప్పగించారు. ఇదే అదనుగా నేతలు రెచ్చిపోయారు. కలెక్టర్లపై ఒత్తిడి తీసుకొచ్చి వివాదస్పద కేసుల పరిష్కారం కోసం పట్టుబట్టారు. దీంతో ఈ కేసులు తాము చేపట్టలేమని కలెక్టర్లు చేతులెత్తేశారు. జిల్లా స్థాయిలో రిటైర్డ్ జిల్లా జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. వారు సిఫారసు చేసిన కేసుల పరిష్కారం చేపడతామన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. అది కూడా ఎంపిక చేసిన ఏడు జిల్లాలకే పరిమితమయ్యేలా కమిటీలు ఏర్పాటు చేస్తూ జీవో 681ని జారీచేసింది. ఇందులో అన్నింటికంటే కీలకమైన విజయనగరం జిల్లాను మినహాయించారు. విశాఖను మాత్రం కమిటీల జాబితాలో చేర్చారు. నిజానికి విశాఖలో ఉన్న నిషేధ భూముల కేసుల పరిష్కారం అంత సులువు కాదు. అక్కడి నేతలను కాదని సెటిల్ చేసే పరిస్థితి ఉందా? దాని పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలో కేసుల పరిష్కారానికి జిల్లా జడ్జి సారథ్యంలో కమిటీ ఏర్పాటు చేయకపోవడం ఇప్పుడు తీవ్ర అనుమానాలు, సందేహాలను రేకెత్తిస్తోంది. రూ.50 కోట్ల విలువైన భూముల సెటిల్మెంట్ చేస్తే ప్రభుత్వానికి నివేదించాలంటోన్న రెవెన్యూ శాఖ.. అంత కంటే ఖరీదైన భూముల పరిష్కారంలో జీవో 300ని పాటించకపోవడం వెనుక మర్మమేమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.