ఆంధ్రప్రదేశ్ : వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షుల వరుస మరణాలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్న మృతి చెందడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ హోం మంత్రి అనిత స్పందిస్తూ… సాక్షుల మరణాలపై కేబినెట్ మీటింగ్ లో చర్చించామని… సమగ్ర దర్యాప్తుకు ఆదేశించామని చెప్పారు. వివేకా హత్య కేసులో ఎవరి మరణాలు అయినా మిస్టరీగా మాత్రం మిగిలిపోవని అన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా… తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని చెప్పారు. రంగన్న పోస్ట్ మార్టం తర్వాత అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.
మరోవైపు కేబినెట్ మీటింగ్ లో రంగన్న మృతిపై చర్చ జరిగింది. వివేకా హత్య కేసులో సాక్షులు చనిపోవడంపై మంత్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పరిటాల రవి హత్య కేసులో కూడా సాక్షులు ఇలాగే చనిపోయరని సీఎం చంద్రబాబుకు చెప్పారు. రంగన్న మృతి కూడా అనుమానాస్పదంగా ఉందని తెలిపారు. దీనిపై డీజీపీ హరికుమార్ గుప్తా వివరణ కోరగా… మరణాలు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పారు. మరణాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డీజీపీని కేబినెట్ ఆదేశించింది.