వైసీపీ అధినేత జగన్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శలు గుప్పించారు. ఏ ముఖ్యమంత్రి చేయని దుర్మార్గపు పనులను ఐదేళ్ల పాలనలో జగన్ చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పట్టించుకోలేదని అన్నారు.
జగన్ చేసిన అరాచకాల వల్ల రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని చెప్పారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనమయిందని దుయ్యబట్టారు. అందుకే వైసీపీని 11 స్థానాలకు ప్రజలు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు.
ముంబై హీరోయిన్ ను పోలీసు అధికారులతో వేధించారని గొట్టిపాటి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతిభద్రతలు గాడిలో పడ్డాయని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
చంద్రబాబు సీఎం అయిన మొదటి రోజు నుంచే రాష్ట్రాన్ని గాడిలో పెట్టే దిశగా పని చేస్తున్నారని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచలేదని గుర్తు చేశారు.
ఎంతో ముందుచూపుతో 20 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్నాలజీని అభివృద్ధి చేశారని తెలిపారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. అన్ని రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.