ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 13న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండడం తెలిసిందే. అయితే అధికార వైసీపీ పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు చేర్పిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనర్హులకు కూడా ఓటు హక్కు కల్పిస్తున్నారని, ఇలాంటి నకిలీ ఓటర్లు వేల సంఖ్యలో ఉన్నారని చెబుతోంది.
ఈ నేపథ్యంలో, టీడీపీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ ను టీడీపీ నేతలు కలిశారు. బోగస్ ఓట్లపై ఈసీ విచారణ జరిపి చర్యలు చేపట్టాలని వినతి పత్రం సమర్పించారు.
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ…. బోగస్ ఓట్ల నమోదుతో వైసీపీ కుట్రలు చేస్తోందని అన్నారు. బోగస్ ఓట్ల విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. చేర్పించినవారే కాకుండా, తప్పుడు పత్రాలతో ఓట్లు పొందిన వారు కూడా శిక్షార్హులేనని చంద్రబాబు స్పష్టం చేశారు.