contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఏపీ క్యాబినెట్ సమావేశం .. నిర్ణయాలపై మంత్రి పార్థసారథి మీడియా సమావేశం

నేడు జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశం వివరాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు తెలియజేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ చట్టాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అమలు చేయడంలేదని తెలిపారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పలు సందేహాలు ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వం ఎవరితోనూ చర్చించకుండానే, హడావిడిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చిందని పార్థసారథి ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో ముఖ్యంగా రైతులు ఆందోళనకు గురయ్యారని తెలిపారు.

నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి, గత ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రజలకు కలిగే లాభనష్టాల గురించి ఆలోచించకుండా, ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకువచ్చారని విమర్శించారు.

ఈ చట్టం ప్రకారం… భూమి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిగా ఎవరినైనా నియమించవచ్చనే అంశం దారుణం అని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. అధికారిని నియమిస్తారా, లేక నామినేటెడ్ వ్యక్తిని నియమిస్తారా అనేది స్పష్టత లేదన్నారు. పైగా, ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కు అపరిమత అధికారాలు ఇవ్వడం, ఆయన తీసుకున్న నిర్ణయమే అంతిమం అని పేర్కొనడం అత్యంత ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు.

పాత ఇసుక విధానం రద్దు అవుతుందని, పలు ఒప్పందాలు కూడా రద్దవుతాయని తెలిపారు. ఇక నుంచి ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి పార్థసారథి చెప్పారు. ఇసుక సరఫరాలో ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం రాదని స్పష్టం చేశారు. ఉచిత ఇసుక పాలసీ అమలుపై కమిటీ వేసి పర్యవేక్షిస్తామని వెల్లడించారు. ఇసుక అంశంపై గత సర్కారు కోర్టులకు తప్పుడు వివరాలు అందించిందని ఆరోపించారు.

ఇక, ఎంఎస్ పీ విధానాలతో రైతులకు అనేక ఇబ్బందులు ఉన్నాయని గుర్తించినట్టు మంత్రి పార్థసారథి తెలిపారు. ధాన్యం సంచుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని వెల్లడించారు. అటు, ధాన్యం సేకరించే మిల్లర్లపైనా పర్యవేక్షణ లేదని అన్నారు. రైతులకు 80 నుంచి 90 రోజుల పాటు బకాయిలు చెల్లించలేదని పేర్కొన్నారు. త్వరలోనే ధాన్యం రైతుల బకాయిలు చెల్లించాలని నిర్ణయించామని మంత్రి చెప్పారు.

గత ఐదేళ్లలో పంటల బీమా అస్తవ్యస్తం చేశారని, గత ప్రభుత్వం లోపభూయిష్టంగా పంటల బీమా విధానం అమలు చేసిందని విమర్శించారు. పంటల బీమాపై కమిటీ వేశామని, నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరామని పార్థసారథి వివరించారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :