ఏపీలో ఇవాళ జరిగిన సార్వత్రిక ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల్లో ఈ రోజు ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారని వెల్లడించారు. ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగిందని, ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటేశారని మీనా వెల్లడించారు. గుర్తింపు కార్డు లేకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారి సంఖ్య ఈసారి తక్కువేనని అన్నారు.
సాయంత్రం 5 గంటల వరకు 68 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. మరిన్ని అంశాలు పరిశీలించిన తర్వాత తుది పోలింగ్ వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ఒకవేళ క్యూలైన్లో 300 మంది వరకు ఉంటే రాత్రి 10 గంటల వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉంటుందని అన్నారు.
పోలింగ్ సమయంలో పలుచోట్ల ఈవీఎంలకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయని తెలిపారు. 275 బ్యాలెటింగ్ యూనిట్లకు సంబంధించి సమస్యలు వచ్చాయని అన్నారు. 217 కంట్రోల్ యూనిట్లు, 600 వీవీ ప్యాట్లకు సంబంధించి సమస్యలు ఉత్పన్నమయ్యాయని ముఖేశ్ కుమార్ మీనా పేర్కొన్నారు. ముందుజాగ్రత్తగా పోలింగ్ కేంద్రాల వద్ద 20 వేల యంత్రాలను అధికంగా అందుబాటులో ఉంచామని చెప్పారు.
ఇక, అనంతపురం, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉందని ముందే సమాచారం ఉందని మీనా తెలిపారు. అలాంటి చోట్ల తగిన ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. పల్నాడు జిల్లాలో 12 ఘటనలపై సమాచారం అందిందని అన్నారు. మాచర్ల, తెనాలి ఘటనలపై పోలీసులు చర్యలు తీసుకున్నారని స్పష్టం చేశారు.
మాచర్ల కేంద్రంలో ఈవీఎంలు దెబ్బతిన్నాయని, ఇంజినీర్లు యంత్రాలు పరిశీలించి డేటా భద్రంగా ఉందని చెప్పారని వివరించారు. మాచర్లలో 8 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ యంత్రాలు మార్చి మళ్లీ పోలింగ్ నిర్వహించామని ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. కోడూరులో రెండు చోట్ల, దర్శిలో రెండు చోట్ల ఈవీఎంలు దెబ్బతిన్నాయని వివరించారు.
రీపోలింగ్ కు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని అన్నారు. ఇవాళ పోలింగ్ సందర్భంగా వచ్చిన ఫిర్యాదులపై రేపు ఎన్నికల పర్యవేక్షకులు, ఆర్వోలు… అన్ని పార్టీల అభ్యర్థులతో సమావేశమై చర్చిస్తారని ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు.
పల్నాడు జిల్లా తంగెడలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, అక్కడ దాడికి ఉపయోగించింది పెట్రోల్ బాంబు అని వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా ఉద్దేశపూర్వకంగా పోలింగ్ జాప్యం జరగడానికి అవకాశం లేదని, తాము ప్రతి అంశాన్ని మానిటరింగ్ చేస్తామని, ఒకవేళ పోలింగ్ ఆలస్యం కావడానికి సాంకేతిక అంశాలు కానీ, మరేదైనా ఇతర కారణం ఉండొచ్చని మీనా అభిప్రాయపడ్డారు.