అమరావతి : రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఏపీ సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం విజయపాల్ హైకోర్టును ఆశ్రయించగా, శుక్రవారం ఆ పిటిషన్‌పై విచారణ జరిగింది. విజయపాల్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్ కే కృష్ణాసాగర్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.
వైసీపీ హయాంలో అప్పటి ఎంపీ రఘురామకృష్ణ రాజుపై రాజద్రోహం, తదితర సెక్షన్ల కింద ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తనను అరెస్టు చేసిన రోజు రాత్రి సీఐడీ పోలీసులు చిత్రహింసలకు గురి చేసి హత్యాయత్నం చేశారంటూ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్ సహా పలువురిపై గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, శుక్రవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది కిశోర్ కుమార్ వాదనలు వినిపించారు. రఘురామను నిబంధనల ప్రకారమే సీఐడీ అరెస్టు చేసి విచారణ జరిపిందని, కస్టడీలో చిత్రహింసలకు గురి చేయలేదని, రఘురామ శరీరంపై గాయాలు లేవని హైకోర్టు ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు నివేదిక ఇచ్చిందని విజయపాల్ న్యాయవాది వాదనలు వినిపించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే ఈ వాదనలను పోలీసుల తరపున సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, పీపీ మెండ లక్ష్మీనారాయణ ఖండించారు. రఘురామకు గాయాలు అయినట్లు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన రిపోర్టును సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుందని వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి .. విజయ్ పాల్‌కు మధ్యంతర మందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు.