కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని గుండ్లపల్లి శ్రీ సాయి గార్డెన్లో ఆదివారం ఆదిత్య స్కూల్ 1996-97 బ్యాచ్10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. దీనికి నాటి గురువులతో పాటు పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరినొకరు కష్ట సుఖాలు తెలుసుకున్నారు. రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆదిత్య స్కూల్ మాజీ కరస్పాండెంట్ చాడ రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ 25 సంవత్సరాల తర్వాత విద్యార్థులంతా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం అభినందనీయమన్నారు. మా స్కూల్లో చదువుకున్న విద్యార్థులు మంచి పొజిషన్ లో ఉన్నారని పేర్కొన్నారు. స్కూల్ కు మంచి గుర్తింపు తెచ్చారని తెలిపారు. ఇలాగే ప్రతి ఏటా ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులంతా గురువులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలుగు టీచర్ రామకృష్ణ, రిటైర్డ్ టీచర్ రాజిరెడ్డి, టీచర్ చంద్రకళ, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
