అమరావతి : వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై మరో కేసు నమోదైంది. ఇదివరకే ముంబయి నటి కాదంబరి జత్వానీ కేసులో అరెస్టై ఆయన విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
అయితే ఆ సమయంలో గ్రూప్ 1 (2018) ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన వ్యవహారంలో అవకతవకలు, నిధుల దుర్వినియోగం చోటుచేసుకున్నట్లు ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచిన అధికారులు కేసు విచారణ బాధ్యతలను ఓ సీనియర్ అధికారికి అప్పగించినట్లు తెలుస్తోంది.
ఏపీపీఎస్సీ నుంచి అందిన నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ జరపాలని డీజీపీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పీఎస్ఆర్‌పై విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో తాజాగా మోసం, నిధుల దుర్వినియోగం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలు దీనిపై దర్యాప్తు ప్రారంభించాయని, ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత ఈ కేసును ఏసీబీకి బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.