పిఠాపురం : ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన వ్యవహరిస్తున్నారు అన్నట్టు ఉంది ఆర్టీసీ ఉద్యోగుల తీరు. ప్రయాణికులు ఏమైతే మాకేంటి రోజు వారీ మా టార్గెట్ పూర్తి కావాలి అంతే.. వృద్దులు, మహిళలు, చదువురాని వాళ్ళనే టార్గెట్ చేసుకుని ఎక్కిన స్టేజ్ నుండి వారు దిగవాల్సిన స్టేజ్ కాకుండా వాళ్ల టార్గెట్ పూర్తి చేసుకునేందుకు టిక్కెట్లు కొడుతూ… అధిక అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నారు ఆర్టీసీ కండెక్టర్లు. ఇది సాక్ష్యాత్తు పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఘటన. వివరాల్లోకి వెళితే పిఠాపురం నుండి పెడపర్తి వెళ్లేందుకు పిఠాపురం పట్టణంలోని స్థానిక ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో వున్న బస్టాండ్ లో వేచి ఉన్న వారికి తుని ఆర్టీసీ డిపో నుంచి విచ్చేసిన ఎపి 39 యువై 4179 నెంబర్ గల బస్ లో సాయంత్రం 5గంటల 10 నిమిషాలకు డ్యూటీలో ఉన్న కండెక్టర్ ప్రయాణికులపై అత్యుత్సాహం ప్రదర్శించాడు. తాను ఇచ్చిన టిక్కెట్ తీసుకుని దానికి మాత్రం డబ్బులు చెల్లించాలని దురుసుగా ప్రయాణికులతో వ్యవహరించిన తీరు ధ రిపోర్టర్ టివి ప్రతినిథి కంట పడింది. దీనిపై బస్సు కండెక్టర్ని వివరణ కోరిన ధ రిపోర్టర్ టివి ప్రతినిథిపై కూడా దురుసుగా ప్రవర్తించాడు. దీని పై తుని ఆర్టీసీ డిపో మేనేజర్ కు ఫోన్ చేసిన అందుబాటులో లేరు. నిత్యం ఇలా ప్రయాణికులపై అత్యుత్సాహం ప్రదర్శించడం… వారి వద్ద నుండి అధిక మొత్తంలో సొమ్ములు వసూలు చేయడం ఈ కండక్టర్ కు పరిపాటిగా మారింది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఈ కండక్టర్ వసూలు చేసే అధిక ధరలలో వారికి కూడా భాగస్వామ్యం వుండటం గమనార్హం. దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులు, రాష్ట్ర అధికార యంత్రాంగం ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి…!