ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఈ నెల 6న హైదరాబాద్‌లో జరగనుంది. చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. సమావేశంలో చర్చించాల్సిన అజెండాను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఈ నెల ఆరో తేదీన జరిగే సమావేశానికి ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలుస్తోంది. మంత్రులు, ఉన్నతాధికారులతో ఈ విషయమై సీఎం చర్చించనున్నారు.
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయింది. అయినప్పటికీ పలు అంశాలు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. పునర్విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో ఉన్న ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంఘం తదితర 23 కార్పోరేషన్ల ఆస్తులపై ఏపీ, తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం కుదరవలసి ఉంది.
పదో షెడ్యూల్‌లోని తెలుగు అకాడమీ, అంబేడ్కర్, తెలుగు యూనివర్సిటీ వంటి 30 సంస్థల ఆస్తులు, సేవలపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాజ్ భవన్, హైకోర్టు, లోకాయుక్త, కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నులు, విద్యుత్ సంస్థల బకాయిలపై వివాదాలు కొనసాగుతున్నాయి. వివిధ అంశాలపై కేంద్ర హోంశాఖ ఇరు రాష్ట్రాలతో పలుమార్లు ఉమ్మడి సమావేశం నిర్వహించింది. అయినప్పటికీ పరిష్కారం కాలేదు