దాచిన బాంబులను, రసాయన ఆయుధాలను కనిపెట్టేందుకు, నేరం జరిగిన చోట నిందితులను గుర్తించేందుకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన శునకాలను వాడుతుండటం మనకు తెలిసిందే. అయితే శునకాలను కొంతకాలం పాటు సర్వీసులో వినియోగిస్తారు. ఆ తర్వాత వాటిని కాపలా కోసం, పెంపుడు జంతువులుగా మారుస్తారు. ఇలా ఆర్మీలో పనిచేసి రిటైరైన శునకాలను సాధారణ వ్యక్తులు పెంచుకోవడం కోసం దత్తత ఇచ్చే నిబంధనలూ ఉన్నాయి. దీనివల్ల అవి భిన్నమైన, మంచి జీవితాన్ని గడిపేందుకు అవకాశం ఉంటుందన్నది ఆలోచన.
చాలా క్రమశిక్షణగా..
ఆర్మీ, పారా మిలటరీ దళాల్లో వినియోగించే శునకాలు అత్యంత క్రమశిక్షణతో కూడి ఉంటాయి. తమ యజమానుల ఆదేశాలు కచ్చితంగా పాటిస్తాయి. రక్షించేందుకు, కాపాడేందుకు ఎంతకైనా తెగిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే వాటిని సైనికులతో సమానంగా చెప్పవచ్చు. అయితే వాటిని ఒక వయసు వరకు, పూర్తి సామర్థ్యంతో ఉన్నంత కాలం మాత్రమే ఆర్మీలో వినియోగిస్తారు. ఆ తర్వాత వాటిని చంపేసేవారు. ప్రతిభ చూపి గ్యాలెంటరీ అవార్డులు పొందిన శునకాలను మాత్రం చంపకుండా ఆర్మీలోనే కాపలా, ఇతర పనుల కోసం వినియోగించేవారు. ఇవి కూడా అతి తక్కువ స్థలంలోనే ఉండాల్సిరావడం, బయటి ప్రపంచంలోకి వెళ్లే అవకాశం లేకపోవడం.. వాటిని బంధించినట్టే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్మీ శునకాలను చంపకుండా.. సాధారణ వ్యక్తులకు కూడా దత్తత ఇస్తున్నారు.
దరఖాస్తు ఎలా.. చూసుకోవాల్సినదెలా?
ఆర్మీ శునకాలను దత్తత తీసుకోవాలనుకునేవారు మీరట్ లోని ఆర్మీ శునకాల ప్రత్యేక శిక్షణ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఢిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. తమకు సంబంధించిన పేరు, చిరునామా, ఇతర పూర్తి వివరాలను అందించాల్సి ఉంటుంది. ఆర్మీ శునకాన్ని బాగా చూసుకుంటామని, అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించబోమని అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తును, అఫిడవిట్ ను పరిశీలించిన తర్వాత అందుబాటులో ఉన్న శునకాలను, వాటి వయసు, ఇతర వివరాలను ఆర్మీ అధికారులు వివరిస్తారు. అందులో నచ్చిన శునకాన్ని దత్తత తీసుకోవచ్చు. ఆర్మీలో శునకాలకు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తుంటారు. అందువల్ల అవి శారీరకంగా బాగా ఫిట్ గా ఉంటాయి. బలమైన ఆహారం అలవాటై ఉంటుంది. అలాంటి ఆహారం పెట్టగలవారు, వాటిని బాగా చూసుకునే ఓపిక ఉన్నవారు వాటిని దత్తత తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.