ఆత్మకూరు పట్టణంలోని ప్రధాన వీధిలో షాపులకు కేటాయించిన హద్దులు దాటి రోడ్డుపైకి వస్తువులను పెడితే వారిపై చర్యలు చేపడతామని ఆత్మకురు సీఐ గంగాధర్ తెలిపారు.. ఆత్మకూరు ఎస్సై జిలాని మరియు పోలీస్ సిబ్బందితో కలిసి సోమశిల రోడ్ సెంటర్ నుండి సత్రం వరకు సీఐ పర్యటించారు.. ఈ సందర్భంగా షాపుల ఎదుట నిర్మించి ఉన్న కాలవను దాటి రోడ్డు పైకి వస్తువులను, బోర్డులను, వాహనాలను నిలిపి ఉన్న వారిని హెచ్చరించి అక్కడి నుండి వాటిని తొలగింప చేశారు.. మరోసారి ఇలా రోడ్డుపైకి షాపుల వస్తువులను తెచ్చి పెడితే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు..ఈ విషయంపై సీఐ మాట్లాడుతూ రానున్న సంక్రాంతి పండుగ రోజులను దృష్టిలో ఉంచుకొని పట్టణానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భారీగా ప్రజలు వచ్చే అవకాశము ఉన్నందున మరియు వాహనాల రద్దీ దృష్ట్యా షాపుల ఎదుట ఎటువంటి వస్తువులను పెట్టవద్దని వాహనాలు నిలుపుదల చేయవద్దని షాపుల యజమానులకు సూచించినట్లు అలాగే పట్టణ ప్రధాన బజారులో ఖాళీ స్థలం వద్ద వాహనాలను నిలిపేందుకు మార్జిన్ ఏర్పాటుచేసి ప్రతిపాదనను మున్సిపల్ కమిషనర్ తో కలిసి పరిశీలిస్తామని తెలిపారు. పండుగల సందర్భంగా ఏర్పడే రద్దీని దృష్టిలో ఉంచుకొని షాపుల యజమానులు కూడా సహకరించవలసిందిగా వారు సూచించారు. ప్రస్తుతం కేవలం సూచనలు మాత్రమే చేసినట్లు మరోసారి రోడ్డుపైకి షాపుల ఎదుట వారి వస్తువులు కనిపిస్తే వాటిని స్టేషన్ కు తరలించి కేసును నమోదు చేస్తామని తెలిపారు.