అనంతపురం / గుత్తి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సభలు విజయవంతమైన సందర్భంగా గుత్తి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుంతకల్ నియోజకవర్గం సమన్వయకర్త వాసగిరి మణికంఠ మాట్లాడుతూ ఇటీవలే రాష్ట్రం మొత్తం మీద 13,326 నిర్వహించిన గ్రామసభలు ప్రభుత్వం దిగ్విజయంగా పూర్తి చేసిందని అన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి కూడా గ్రామసభల్లో పాల్గొనడం హర్షణీయమని కొనియాడారు. సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రజలను కూడా భాగస్వాములను చేస్తూ స్థానిక గ్రామాల అభివృద్ధికి సలహాలు సూచనలు తీసుకొని గ్రామస్థాయిలో అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నాంది పలికిందని ఆయన అన్నారు. పంచాయతీ సర్పంచుల అధ్యక్షతన జరిగిన ఈ గ్రామ సభలలో 4500 కోట్ల రూపాయల విలువైన ఉపాధి హామీ పనులకు ప్రజలే తీర్మానించారు. గత వైసీపీ పాలనలో గ్రామ సభలు క్షేత్రస్థాయిలో జరగలేదని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయని పేర్కొన్నారు. గ్రామాలలో మౌలిక సదుపాయాలు స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రజలే ముందుకు వచ్చి అధికారులతో మాట్లాడే అవకాశం కల్పించడమే గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. కుల మత వర్గ పార్టీ బేధాలు లేకుండా అన్ని సామాజిక వర్గాల వారు గ్రామ సభల్లో పాల్గొని జయప్రదం చేశారని అన్నారు. గత వైసిపి పరిపాలనలో గ్రామ సభలో కేవలం కాగితాలకు రికార్డులకు మాత్రమే పరిమితం అయ్యాయని… గ్రామ సభలు నిర్వహించకుండా నిర్వహించినట్లు కాగితాలపై రాయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.