అనంతపురం జిల్లా, యాడికి: యాడికి మండలంలో ఎన్నికల పాసుల జారీ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. ఎన్నికల విధులు నిర్వహించే మీడియా ప్రతినిధులకు పాసుల జారీ విషయంలో అధికారులు అనుసరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల అధికారి షమీమ్ బాషా, ఎంపీడీఓ వీరరాజు వ్యవహారశైలిపై మీడియా వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
మీడియా ప్రతినిధుల ఆరోపణల ప్రకారం, తొలుత అక్రిడిటేషన్ లేకున్నా కొందరికి ఎన్నికల పాసులు జారీ చేసిన అధికారులు, అనంతరం మాత్రం “అక్రిడిటేషన్ ఉన్నవారికే పాసులు ఇస్తాం” అంటూ మాట మార్చారని అంటున్నారు. ఈ ద్వంద్వ వైఖరి పలు అనుమానాలకు తావిస్తోందని విలేకరులు పేర్కొంటున్నారు.
ఈ విషయంపై ప్రశ్నించిన మీడియా ప్రతినిధులకు, “ఎవరికి పాసులు ఇచ్చామో వివరాలు తీసుకురండి… అవసరమైతే వాటిని రద్దు చేస్తాం” అని అధికారులు స్పందించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే అంశంపై ఉదయం ఒక నిర్ణయం, సాయంత్రం మరో నిర్ణయం తీసుకోవడం అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ముఖ్యంగా మహిళా విలేకరుల పట్ల కూడా ఇదే విధమైన వైఖరి ప్రదర్శించారన్న ఆరోపణలు మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల వంటి కీలక ప్రక్రియలో మీడియాకు సమాన అవకాశాలు కల్పించకుండా వివక్ష చూపుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగాలంటే మీడియాకు పాసుల జారీ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను అమలు చేయాలని, అందరికీ సమాన న్యాయం జరిగేలా జిల్లా ఎన్నికల అధికారులు జోక్యం చేసుకోవాలని జర్నలిస్టు సంఘాలు, మీడియా ప్రతినిధులు కోరుతున్నారు.








