- ఉపాధి హామీ పనులు కల్పించాలని.. తొమ్మిది వారాల పెండింగ్ వేతనాలు చెల్లించాలని అనంతపురం జిల్లా డ్వామా ఆఫీస్ ముందు ధర్నా
అనంతపురం : అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామి పెండింగ్లో వున్న తొమ్మిది వారాల వేతనాలు చెల్లించాలని, రాజకీయ కారణాలతో ఉపాధి పనులు ఆపరాదని, పనిముట్లు, పే స్లిప్పులు ఇవ్వాలని, ఉపాధి హామీ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకురాలు వి. సావిత్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కృష్ణమూర్తి డిమాండ్ చేశారు.
జిల్లాలో రెక్కల కష్టంమీద ఆధారపడిన వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ చట్టం ఒక వరంలాగా ఉందని, ఈ చట్టం ద్వారా సుమారుగా మూడు లక్షల మంది ఉపాధి హామి కూలీలు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, . రాజకీయ కారణాలతో ప్రస్తుతం ఆరు వేల మందికి మాత్రమే పనులు కల్పించారని, ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త నిబంధనలు తీసుకొచ్చి, సమ్మర్ అలవెన్స్ ఎత్తివేయడం, రెండు పూటల పని, ఆన్లైన్ మస్టర్ ద్వారా చేసిన పనులకు వేతనాలు చెల్లించకుండా నెలల తరబడి నిర్లక్ష్యం చేస్తూందని జిల్లాలో ఇప్పటికే 8 వారాల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, పనుల దగ్గర కనీస సౌకర్యాలు, నీడ, నీళ్ళు, మెడికల్ కిట్లు, పనిముట్లు లేవని, కావున రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామి కూలీలను, వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలని ఎ.పి. వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటి డిమాండ్ చేసింది.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంగం జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ నారాయణ, నాగ లింగయ్య, సహాయ కార్యదర్శులు, భాస్కరు, పెద్దయ్య, పుష్పరాజ్, ఆదెన్న తదితరులు పాల్గొన్నారు.