శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా, కర్రలు, రాడ్లతో వచ్చిన వ్యక్తులు తీవ్రస్థాయిలో దాడికి పాల్పడడం తెలిసిందే. దీనిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. బీజేపీ నేతలపై నేడు ధర్మవరం ప్రెస్ క్లబ్ లో దాడి జరిగిందని తెలిపారు. పట్టపగలు… పాత్రికేయుల సమావేశం జరుగుతుండగా వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
కాగా, ఈ దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణలతో కలిసి పరామర్శించినట్టు విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఈ దాడి ఘటనపై ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలని ఏపీ బీజేపీ తరఫున డిమాండ్ చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, ఈ తరహా ఘటనలకు ఈ ప్రభుత్వం అడ్డుకట్ట వేయకపోతే బీజేపీ ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందని హెచ్చరించారు.