16ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వాడకుండా ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ ఓ బిల్లును ఆమోదించింది. బుధవారం ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగా 102 ఓట్లతో ఆమోదం పొందింది. మెజార్టీ పార్టీలు దీనికి మద్దతు తెలపగా, సభలో 13 మంది మాత్రం వ్యతిరేకంగా ఓటు వేశారు. ఒకవేళ ఈ వారంలోనే ఇది చట్టరూపం దాల్చితే, సామాజిక మాధ్యమాలకు దీనిపై ఆదేశాలు జారీ చేస్తారు. అయితే ఈ నిబంధన అమలు చేసేందుకు సామాజిక మాధ్యమాలకు ఏడాది పాటు సమయం ఇవ్వనున్నారు. చిన్నపిల్లలు సోషల్‌మీడియా ఖాతాలు వినియోగించకుండా ఈ 12 నెలల్లో వీరు తమ మాధ్యమాల్లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు (భారత కరెన్సీలో దాదాపు రూ.273 కోట్లకు పైమాటే) జరిమానా విధిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం వెల్లడించింది. టిక్‌టాక్, ఫేస్‌బుక్, స్నాప్‌చాప్, రెడిట్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ తదితర మాధ్యమాలకు కూడా ఈ చట్టం వర్తించనుంది. ఇది అమల్లోకి వస్తే, ప్రపంచంలోనే ఈ తరహా నిబంధనలు విధించిన మొదటిదేశంగా ఆస్ట్రేలియా నిలవనుంది.