టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న గంటా శ్రీనివాసరావు ఇటీవల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను కలవడం చర్చనీయాంశం అయింది. అయితే, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తాజాగా చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు దాక్కున్న వాళ్లు ఎన్నికల ముందు బయటికి వస్తున్నారని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ పార్టీకి అండగా నిలవాలనే తాము కోరుకుంటున్నామని తెలిపారు. అలాంటి వారే నిజమైన కార్యకర్తలు అని స్పష్టం చేశారు. పార్టీ కష్టాల్లో ఉంటే ఇంట్లో పడుకునేవాడు నిజమైన కార్యకర్త ఎలా అవుతాడని ప్రశ్నించారు.
ఇక, తాటికొండలో జరిగిన కార్యక్రమంలో కొందరు కార్యకర్తలు తనను కాబోయే హోం మినిస్టర్ అన్నారని, కానీ ఒట్టి హోం మినిస్టర్ కంటే లా అండ్ ఆర్డర్ తో కలిపి హోం మంత్రి పదవి ఇస్తే, తన తడాఖా ఏంటో చూపిస్తానని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. కొందరు పోలీసు అధికారుల సంగతేంటో చూస్తానని అన్నారు.
లా అండ్ ఆర్డర్ సీఎం వద్ద, హోం మినిస్ట్రీ మరొకరి వద్ద ఉంటే ఏం పవర్ ఉంటుందని అన్నారు. లా అండ్ ఆర్డర్ అంటే షూట్ ఎట్ సైట్ అన్నట్టుండాలని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గత టీడీపీ ప్రభుత్వంలో పనిచేసిన హోంమంత్రుల పేర్లను కూడా అయ్యన్న ప్రస్తావించారు. ముందొక కారు, వెనుకొక కారు తప్ప వారికి పవర్స్ ఏమున్నాయని వ్యాఖ్యానించారు. లా అండ్ ఆర్డర్ ఎప్పుడూ సీఎం వద్దే ఉంటుందని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.