ఇచ్ఛాపురం: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో బాహుదా నదిపై ఉన్న వంతెన కూలిపోయింది. బుధవారం ఉదయం గ్రానైట్ రాళ్ల లోడుతో లారీ వెళ్తుండగా ఒక్కసారిగా వంతెన కూలింది..
వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని అస్కా నుంచి ఒంగోలుకు 70 టన్నుల గ్రానైట్ రాళ్ల లోడుతో లారీ వెళుతోంది. భారీ బరువుతో వచ్చే వాహనాలు సాధారణంగా పక్కనే ఉన్న జాతీయ రహదారి పైనుంచి వెళ్తుంటాయి. కానీ గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ మాత్రం ఇచ్ఛాపురం పట్టణం మీదుగా వచ్చింది.
ఈ క్రమంలో బాహుదా నది వద్దకు చేరుకోగానే వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో లారీ కిందికి నదిలోకి జారిపోయింది. నదిలో నీరు లేకపోవడం.. ప్రమాదం జరిగిన సమయంలో వంతెనపై ఇతర వాహనాల రాకపోకలు జరగకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు..
బ్రిడ్జి కూలిపోవడంతో నేరుగా ఇచ్ఛాపురం పట్టణంలోకి వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దానికి ప్రత్యామ్నాయంగా పోలీసులు జాతీయ రహదారి వైపు నుంచి బస్సులు, ఇతర వాహనాలను మళ్లిస్తున్నారు. బాహుదా నదిపై ఈ వంతెనను 1929లో అప్పటి బ్రిటీష్ పాలనలో నిర్మించారు. ఎప్పటి నుంచో బ్రిడ్జి బలహీనంగా మారుతున్నా పాలకులు పట్టించుకోలేదని.. అందుకే నేడు కూలిపోయిందనే విమర్శలు వస్తున్నాయి..