సినీ హీరో అల్లు అర్జున్ ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బన్నీకి నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
అయితే అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతనికి కోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సంధ్య థియేటర్ ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు నటుడికి 14 రోజుల రిమాండ్ విధించింది.
మరోవైపు, తనపై చిక్కడపల్లిలో నమోదైన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. క్వాష్ పిటిషన్ అత్యవసరమేమీ కాదని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో క్వాష్ పిటిషన్‌లోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టును కోరారు.
సుదీర్ఘ వాదనల అనంతరం అల్లు అర్జున్‌కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైలు సూపరింటెండెంట్‌కు రూ.50 వేల సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అర్ణబ్ గోస్వామి కేసులో బాంబే కోర్టు తీర్పు ఆధారంగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించాలని సూచించింది. అంతేగాకుండా, ఈ కేసులో సంధ్యా థియేటర్ యాజమాన్యానికి కూడా ఇదే తీర్పు వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది.
అనంతరం క్వాష్ పిటిషన్ పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు… మధ్యంతర బెయిల్ పై విచారణను జనవరి 21కి వాయిదా వేసింది.
అల్లు అర్జున్ వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే: న్యాయవాది
అల్లు అర్జున్ ప్రతిసారి తన సినిమా విడుదల రోజు థియేటర్‌కు వెళతారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇప్పుడు కూడా సంధ్య థియేటర్ యాజమాన్యం, నిర్మాత, పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. అల్లు అర్జున్ థియేటర్ మొదటి అంతస్తులో కూర్చున్నారని హైకోర్టుకు తెలిపారు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడమంటే వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అన్నారు. అతనిని అరెస్ట్ చేసినందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ తగిన భద్రత ఇవ్వలేదన్నారు. అక్కడున్న పోలీసులు కూడా అల్లు అర్జున్‌ను చూసేందుకే ఆసక్తి చూపించారన్నారు.