- తిరుమల బాలాజి మహారాష్ట్ర వాసులను ఆశీర్వదించడానికి వచ్చారు: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే
- తిరుమల ఆలయ తరహాలోనే నవీ ముంబైలో బాలాజి ఆలయం
- టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి
- దివ్య కార్యంలో భాగం కావడం నా అదృష్టం
- రేమండ్స్ గ్రూప్ సీఎండీ గౌతమ్ హరి సింఘానియా
- ముంబై లో శ్రీ బాలాజి ఆలయ నిర్మాణానికి శాస్త్రోక్తంగా భూమి పూజ
తిరుపతి, జూన్-7 : మహారాష్ట్ర ప్రజల చిరకాల కోరికను నెరవేర్చి మనల్ని ఆశీర్వదించడానికి తిరుమల బాలాజి నవీ ముంబై లో కొలువుదీర బోతున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సంతోషం వ్యక్తం చేశారు.నవీ ముంబైలోని ఉల్వేలో మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల స్థలంలో శ్రీవేంకటేశ్వర (బాలాజి ) ఆలయ నిర్మాణానికి బుధవారం శాస్త్రోక్తంగా భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేతో పాటు, డెప్యూటీ సిఎం దేవేందర్ ఫడ్నవీస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి షిండే ఆలయ విశేషాలను మీడియా ప్రతినిధులకు వివరించారు. అనంతరం సిఎం “వెంకటరమణ గోవిందా” అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నవీ ముంబైలో తిరుపతి బాలాజి మందిర నిర్మాణానికి శంఖు స్థాపన జరిగిన ఈ రోజు మహారాష్ట్రకు మరపురాని రోజు అన్నారు. తిరుమలలో బాలాజిని దర్శించుకునే అదృష్టం అందరికీ ఉండదన్నారు. రాబోయే రోజుల్లో ముంబైలోనే శ్రీ బాలాజి (వేంకటేశ్వరుని) దర్శనం చేసుకునే అదృష్టం మహారాష్ట్ర ప్రజలకు లభించబోతోందని చెప్పారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌లోని 22 కిలోమీటర్ల పొడవైన సింగిల్ బ్రిడ్జి త్వరలో మహాలక్ష్మి ఆలయానికి అనుసంధానించబడుతోందన్నారు. ఈ పనులన్నీ శ్రీ బాలాజి ఆశీర్వాదంతో జరుగుతున్నాయన్నారు. నవీ ముంబైలోని బాలాజి ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సిఎం చెప్పారు. టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యులు, అధికారులు, దాతలు, మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, మహారాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ అయిన బాలాజి ఆలయాన్ని తిరుమల ఆలయం తరహాలో నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారన్నారు. ఇందుకు అవసరమైన ఆలయ నిర్మాణ ప్రణాళిక సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు . ఆలయ నిర్మాణం ఖర్చు మొత్తం భరించడానికి రేమండ్ గ్రూప్ సిఎండి శ్రీ గౌతమ్ హరి సింఘానియా ముందుకు వచ్చారని వివరించారు. రెండేళ్ళలో ఆలయ నిర్మాణం పూర్తి చేసి భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తామని చెప్పారు.
గౌతమ్ సింఘానియా మాట్లాడుతూ, ఇది తనకు చాలా సంతోషకరమైన రోజని చెప్పారు. తాను ఐదు దశాబ్దాలుగా తిరుమల బాలాజిని దర్శిస్తున్నానని చెప్పారు. ముంబైలో శ్రీ బాలాజి ఆలయాన్ని నిర్మించే అదృష్టం స్వామి తనకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆలయం మహారాష్ట్ర ప్రజలకు ఎంతో ఆధ్యాత్మిక ఆనందం పంచుతుందని ఆయన చెప్పారు. అందరి సహకారంతో ఆలయాన్ని అత్యంత వేగంగా నిర్మిస్తామన్నారు. టీటీడీ ఈవో ఎవి ధర్మా రెడ్డి, బోర్డు సభ్యులు మిలింద్ నర్వేకర్ , అమోల్ కాలే, రాజేష్ శర్మ, సౌరభ్ బోరా, సిడ్కో విసి డాక్టర్ సంజయ్ ముఖర్జీ, టీటీడీ ఎస్ఈ జగదీశ్వర్ రెడ్డి తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పలువురు టీటీడీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.