ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మరోమారు ఫైరయ్యారు. వైసీపీలోని కొందరు నేతలు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఇటీవల వ్యాఖ్యానించిన బాలినేని తాజాగా వారికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాను తింటున్నది కూడా ఉప్పూ కారమేనని, ఇకపై వారు పద్ధతి మార్చుకోకుంటే కాళ్లు విరగ్గొడతానని హెచ్చరించారు. నిన్న జరిగిన ఒంగోలు పార్టీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తమ పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రతిపక్షానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జనార్దన్, మునిసిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనుతో చేతులు కలిపి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలా చేతులు కలిపిన వారు ఎవరో తనకు తెలుసని, వారు ఎంత పెద్ద వారైనా వదిలిపెట్టబోనని హెచ్చరించారు. ఇప్పటి వరకు ఓపిక పట్టానని, ఇక తన వల్ల కాదని స్పష్టం చేశారు. విషయాన్ని సీఎం జగన్ వద్దకు తీసుకెళ్తానని బాలినేని పేర్కొన్నారు.