బాసర : చదువుల తల్లి క్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి . వేదాలకు ఆద్యుడైన వేద వ్యాసుడి జయంతిని పురస్కరించుకొని జరుపుకునే వ్యాస పూర్ణిమ లేక గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో మూడు రోజులపాటు వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వేద వ్యాసుడే స్వయంగా ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రితిష్టించినందున ఈ ఆలయం దక్షిణ భారత దేశంలో దివ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది.
మహాలక్ష్మీ, మహాకాళి సహితంగా ఇక్కడ కొలువై ఉన్న చదువుల తల్లి సరస్వతి దేవిని దర్శించుకునేందుకు నిత్యం చాలామంది భక్తులు బాసరకు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళారు . తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి సమక్షంలో తమ చిన్నారులకు అక్షరశ్రీకారం చేయిస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ గురుపౌర్ణమి వేడుకలనే కాకుండా శారదీయ దేవి శరన్నవరాత్రులతోపాటు వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక పూజలకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మూడు రోజులపాటు జరిగే ఈ గురుపౌర్ణమి ఉత్సవాలు ఈసారి కూడా వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకల ప్రారంభం సందర్భంగా మంగళ వాయిద్యాలతో వ్యాసాలయ ప్రవేశం, శాంతిపాఠము, దీక్షాసంకల్పం, విఘ్నేశ్వరపూజ స్వస్తిపుణ్యాహవాచనం ఋత్విగ్వరణం, మంటపారాధన, కలశస్థాపన, దేవతాస్థాపన, వేదపారాయణ నీరాజన మంత్రపుష్పాది కార్యక్రమాలను ఆలయ వైదిక బృందం ఆధ్వర్యంలో శాస్త్రోకతంగా నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు రామారావు పటేల్ ఈ వేడుకలకు హజరై వ్యాసుల వారికి మంగళ ద్రవ్యాలు సమర్పించారు. ఆలయ వ్యవస్థాపక చైర్మెన్ శరత్ పాఠక్, కార్యనిర్వహణాధికారి విజయరామారావు, అర్చకులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.